నాగార్జున సాగర్ ఎన్నికల హడావుడి మళ్లీ మొదలైంది. నాగార్జున సాగర్ ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఈరోజు నుంచి ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి నామపత్రాలు స్వీకరించనున్నది. 31న పత్రాలను పరిశీలించనుండగా.. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. నామినేషన్ల స్వీకరణ కోసం నిడమనూరు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక చాంబర్, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు.
నామినేషన్లు సమర్పించే సమయంలో కొవిడ్ నిబంధనల మేరకు అభ్యర్థితో పాటు ఒక్కరినే అనుమతించనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. సాగర్ నియోజకవర్గంలో 2,19,745 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 1,08,907 మంది పురుషులు, 1,10,838 మంది మహిళలు ఉన్నారు. ఏప్రిల్ 17న ఉప ఎన్నిక నిర్వహించి.. మే 2న కౌంటింగ్ నిర్వహిస్తారు.