తమిళనాడు రాజకీయాలపై ఆ రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో ఆపద్దర్మ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. పన్నీరు సెల్వం గవర్నర్ భేటీలో మాట్లాడిన మాటాలు….బలవంతంగా రాజీనామా చేయించారు…అసెంబ్లీలో బలనిరూపణకు నాకు ఒక అవకాశం ఇవ్వాలి…నా రాజీనామా వెనక్కి తీసుకొని ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి. అదేవిధంగా శశికళపై కేసులున్నాయి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్‌ను సెల్వం కోరారు.
రాజ్‌భవన్‌లో గవర్నర్ విద్యాసాగర్‌రావుతో సమావేశం అనంతరం పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌తో తన సమావేశం దాదాపు ఏడు నిమిషాలపాటు జరిగిందని సెల్వం చెప్పారు. ధర్మమే గెలుస్తుందని సెల్వం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తమకు న్యాయం జరుగుతుందని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు. తనకు ‘అమ్మ’ జయలలిత ఆశీర్వాదాలు ఉన్నాయని తెలిపారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తమ వెంటే ఉన్నారని ఆయన మరోసారి స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో సెల్వం సంతోషంగా కనిపించారు. తానే సీఎంగా కొనసాగుతాననే సంతోషం సెల్వం ముఖంలో కనిపించింది. గవర్నర్‌ను కలిసినవారిలో అన్నా డీఎంకే సీనియర్ నేత మైత్రేయన్ కూడా ఉన్నారు.
మద్దతుదారులైన నేతలు, కార్యకర్తల మధ్య పన్నీర్ నవ్వుతూ కనిపించారు. ఆయన నవ్వుతూ కళకళలాడటంతో అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. అయితే, పన్నీర్‌కు ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది? ఆయనకు గవర్నర్ మరో అవకాశం ఇస్తారా? లేదా? అనే దాని పై సస్పెన్స్ కొనసాగుతుంది.ఇదిలావుండగా మరోవైపు సోషల్ మీడియాలో పన్నీర్ సెల్వంకు మద్దతు పెరుగుతోంది.