రాష్ట్రంలో జరిగిన రెండు ఎమ్మెల్సీ స్ధానాల కౌంటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం హాళ్లలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానాల ఓట్లను లెక్కిస్తున్నారు. హైదరాబాద్ స్థానంలో 3,57,354 ఓట్లు పోలవగా, నల్లగొండ స్థానంలో 3,86,320 ఓట్లు పోలయ్యాయి.
కౌంటింగ్ సందర్భంగా ఒక్కో హాల్‌లో 7 టేబుళ్ళ చొప్పున మెత్తం 56 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 25 బ్యాలెట్ పత్రాల చొప్పున కట్టలు కడుతున్నారు. టేబుల్‌కు వెయ్యి చొప్పున 56 వేల ఓట్లను లెక్కించనున్నారు. రాత్రి 8 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రాత్రి 9.30 గంటల తర్వాతే తొలి రౌండ్ పూర్తయ్యే అవకాశం ఉన్నది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు తేలకుంటే ఎలిమినేషన్ ప్రక్రియ చేపడుతారు. హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి ఎమ్మెల్సీ స్ధానానికి 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.