పార్ల‌మెంట్‌లో తగ్గని పెట్రో మంట..

132
- Advertisement -

పెట్రోల్ ధరలు పెంపుపై పార్లమెంటు దద్దరిల్లింది. మంగళవారం లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్షాలు పెరిగిన ధరలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీంతో ఇవాళ రెండు స‌భ‌లు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా ప‌డ్డాయి. ఇవాళ ఉద‌యం లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లు పాత ప‌ద్ధ‌తిలో స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. 11 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఉభ‌య‌స‌భ‌లు తొలుత 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా ప‌డ్డాయి. పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల అంశంపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని ఉభ‌య‌ స‌భ‌ల్లోనూ విప‌క్షాలు డిమాండ్ చేశాయి. ప్ర‌శ్నోత్త‌రాల‌ను అడ్డుకున్నాయి.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను విపక్షాలు చుట్టుముట్టాయి. అయితే తమ స్థానాలకు వెళ్లాలని స్పీకర్ ఎంత చెప్పినప్పటికీ లెక్క చేయకుండా అక్కడే ఉండే నినాదాలతో హోరెత్తించారు విపక్ష పార్టీ సభ్యులు. దీంతో సభను వాయిదా వేశారు. అయితే ఆ త‌ర్వాత స‌మావేశ‌మైన ఉభ‌య‌స‌భ‌ల్లోనూ మ‌ళ్లీ అదే సీన్ రిపీటైంది. దీంతో లోక్‌స‌భ‌ను మీనాక్షి లేఖి, రాజ్య‌స‌భ‌ను డిప్యూటీ చైర్మ‌న్ హ‌రివంశ్ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.

ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా రైతులు ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. ఈ అంశంపై కూడా పార్లమెంటులో రగడ నడుస్తుండగానే మరోవైపు పెట్రోల్ ధరలపై కూడా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నిరసనలు తెలుపుతున్నారు. కోవిడ్ కారణంగా ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ సమావేశాలను నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. కానీ మంగళవారం నుంచి ఉభయ సభలు ఉదయం 11 గంటలకే ప్రారంభం అయ్యాయి.

- Advertisement -