ఈ సృష్టిలో స్త్రీ పాత్ర ఎవరు భర్తీ చేయలేరని జలమండలి ఎండీ శ్రీ. ఎం.దానకిషోర్ గారు తెలిపారు. జలమండలి ఉమెన్స్ మినిస్టీరియల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో తేది: 08.03.2021, సోమవారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎండీ దాన కిశోర్, ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ మొదట బోర్డు మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మనదేశంలో ఒకప్పుడు సతీసహగమనం వంటి దురాచారాలు ఉండేవని,కానీ నేటి ఆధునిక కాలంలో అలాంటి పరిస్థితులు లేవని అన్నారు. అనేక మంది స్త్రీలు అత్యున్నత పదవులను అధిరోహించారని వాఖ్యానించారు. సమాజంలో స్త్రీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. కానీ నేడు సమాజంలో అనేక రకాలైన అకృత్యాలు జరుగుతున్నాయని, అందులో అత్యధికంగా మహిళలపై జరగడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అవి జరగకుండా ఉండాలంటే ప్రతి స్త్రీ తమ ఇంట్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
తల్లిగా, సోదరిగా, భార్యగా, ఉద్యోగిగా ఇలా విభిన్న పాత్రలను వారు ఏకకాలంలో నిర్వర్తిస్తున్నారని తెలిపారు. కుటుంబం అనేది సమాజానికి పునాది లాంటిదని అందులో స్త్రీల పాత్ర గొప్పదని కొనియాడారు. ఈ రోజు అధికారికంగా మహిళ దినోత్సవం నిర్వహిస్తున్నాము కానీ ప్రతిరోజు మహిళా దినోత్సవంగా భావించి మహిళలను గౌరవించాలని సూచించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు పలు రకాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితియ స్థానాల్లో నిలిచిన వారికి ఎండీ దానకిషోర్ బహుమతులు ప్రధానం చేశారు. జలమండలి ఉమెన్స్ మినిస్టీరియల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీమతి. టి.వి. సరస్వతి, ఉపాధ్యాక్షురాలు ఏ.జె. సుగంధిని ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. వర్ధమాన సినీనటి మంజీరా ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టర్ పి. రవి కుమార్, రెవెన్యూ డైరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్, ప్రముఖ సినీ నటి రోజా రమణి, సామాజిక కార్యకర్త భారతీయ సత్యవాణి, వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ అధ్యక్షులు జి. రాంబాబు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ అక్తర్ అలీ, జనరల్ సెక్రటరీ జయరాజ్ లతో పాటు మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు.