తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ లీగల్ సెల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి శ్రీ కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ వినోద్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. న్యాయవాదులు తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే వారినే సీఎం కేసీఆర్ అడ్వకేట్ జనరల్‌గా నియమించినట్లు తెలిపారు. హైకోర్టు విభజన కోసం ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన తర్వాతనే తెలంగాణకు న్యాయం జరిగిందన్నారు.
తెలంగాణ వచ్చినంక రైతులకు ఎంతో లబ్ది జరిగిందన్నారు. తెలంగాణ రాకముందు రైతులకు కరెంట్ లేదు, ఎరువులు లేవు, రుణ కష్టాలుండేవన్నారు. కాగా సాధించుకున్న తెలంగాణలో దేశమే అబ్బురపడే విధంగా అద్భుతమైన కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేపట్టారన్నారు. ప్రధాని మోదీ కూడా మన పథకాల్ని కాపీ కొట్టినట్లు తెలిపారు. గతంలో 24 లక్షల మందికి పింఛన్లు వస్తే ఇప్పుడు 42 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. 9 లక్షల మంది అమ్మాయిలకు రూ.లక్షా 116 లు ఇచ్చాం. రైతు బీమా పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు. రైతు ఎలా చనిపోయినా రూ.5 లక్షల బీమా ఇస్తున్నట్లు చెప్పారు. 945 గురుకులాల ద్వారా ఉచిత విద్య అందిస్తున్నాం. ఉన్నత చదువుల కోసం రూ.25 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపుతున్నట్లు తెలిపారు. కొందరు సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్, కేసీఆర్ లేకపోతే టీ బీజేపీ, టీ కాంగ్రెస్ ఎక్కడ ఉండేవని ప్రశ్నించారు. మీ ముఖాలకు ఎంతోకొంత విలువ వచ్చిందంటేనే అది టీఆర్ఎస్, కేసీఆర్ వల్లేనన్నారు.
శాంతిభద్రతల విషయంలో సీఎం కేసీఆర్ కఠినంగా ఉన్నారన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తప్పకుండా కృషి చేస్తామన్నారు. వామన్‌రావు హత్య కేసును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నట్లు దుయ్యబట్టారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చినంక న్యాయవాదుల కోసం ఏం చేసిందో రాంచందర్‌రావు చెప్పాలని ప్రశ్నించారు. న్యాయవాదుల కోసం తమ ప్రభుత్వం రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వంలో రూ.10 వేల కోట్లతో న్యాయవాదుల సంక్షేమం కోసం నిధి ఏర్పాటు చేయించాలన్నారు. ప్రశ్నించే గొంతు అనే చెప్పే రాంచందర్‌రావు బయ్యారం స్టీల్, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు ప్రశ్నించటం లేదన్నారు.
నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు. నల్లధనం తీసుకురాలేదు కానీ నల్లచట్టాలను మాత్రం తీసుకొస్తున్నారన్నారు. జీడీపీ పెంచుతామని చెప్పి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో న్యాయవాదుల సంక్షేమానికి ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణలో మాదిరిగా మీ పాలిత ప్రాంతాల్లో చేస్తున్నారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.