రాష్ట్రంలో ఉద్యోగాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు విసిరిన సవాలుకు మంత్రి కేటీఆర్ షాకింగ్ సమాధానమిచ్చారు. ఉద్యోగాల కల్పనపై ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా చర్చకు రావాలని ఆదివారం కేటీఆర్‌కు బీజేపీ నేత రామచంద్రరావు సవాల్ విసిరారు. ‘నేను ఆర్ట్స్ కాలేజీ వద్ద ఉన్నాను.. ఎక్కడున్నావు మిస్టర్ కేటీఆర్?’ అంటూ ఆయన ప్రశ్నించారు. దీనిపై మంత్రి కేటీఆర్ సోమవారం స్పందిస్తూ రామచంద్రరావుకి చురకలంటించారు.
ప్రధాని మోదీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను ఆయన గుర్తు చేశారు. ఏడాదికి 2 కోట్ల చొప్పున ఇప్పటివరకు మొత్తం 12 కోట్ల ఉద్యోగాలను ఎన్డీఏ ఇచ్చిందా? అన్న విషయంతో పాటు, జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేసిందా? అన్న విషయంపై సమాచారం సేకరించడంలో తాను బిజీగా ఉన్నానని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. అయితే, దీనికి ఎన్డీఏ సమాధానం చెప్పట్లేదని, అసలు ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ అని ఆయన అభివర్ణించారు. తన ప్రశ్నలకు సమాధానం ఉంటే షేర్ చేయాలని ఆయన సవాలు విసిరారు.