బీజేపీ హఠావో..దేశ్ బచావో…ట్విట్టర్‌లో వార్..!

304
modi
- Advertisement -

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ…ఉద్యోగాల పేరుతో అసత్య ప్రచారం చేస్తూ పట్టభద్రులను, నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టిస్తున్న బండి సంజయ్‌కు ట్విట్టర్‌లో నిరుద్యోగులు మోదీ సర్కార్‌పై చేస్తున్న యుద్ధం షాక్ ఇస్తోంది. 2014లో అధికారంలోకి రాగానే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ మోదీ సార్ కోతలు కోసారు. దేశ యువత నమ్మి అఖండ విజయం కట్టబెట్టారు. బీజేపీకి ప్రధానంగా ఓటు వేసిది యువతే..దేశవ్యాప్తంగా అయినా…తెలంగాణలో అయినా యువతలోని భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టడంలో కాషాయనేతలు రాటుదేలిపోయారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా మోదీ సార్ 2 కోట్ల ఉద్యోగాల భర్తీపై నోరు విప్పింది లేదు..పైగా ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత తీవ్ర నిరాశ , నిస్పృహలో కొట్టుమిట్లాడుతోంది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చే సమయానికి దేశంలో నిరుద్యోగ రేటు 5.61శాతం కాగా.. 2020 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 23.74 శాతంగా ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఇవి గాలివాటు లెక్కలు కావు..కేంద్రం చెబుతున్న లెక్కలు..2020 డిసెంబరు నాటికి దేశంలోని పట్టణ ప్రాంతాల ప్రజల్లో నిరుద్యోగ రేటు 7.8గా ఉందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. నిరుద్యోగ యువతలో ఎక్కువగా గ్రాడ్యుయేట్లే ఉన్నారు. దేశ పురోభివృద్ధిలో అత్యంత కీలకమైన 20-24 వయసువారిలో నిరుద్యోగ రేటు ఏకంగా 37 శాతం ఉంది. వారిలో 63 శాతం మంది పట్టభద్రులని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ)’ నివేదిక చెబుతోంది.

అంటే ప్రతి ముగ్గురిలో ఒక గ్రాడ్యుయేట్ మాత్రమే ఉద్యోగం చేస్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్ వంటి నేతలు ఉద్యోగాలపై కేసీఆర్ సర్కార్‌‌‌పై బురద జల్లుతుంటారు. ఈ ఆరున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. 2 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు యువతకు దక్కాయి. అయితే దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని కేంద్రం బుట్టలో పడేసిన సంగతిపై మాత్రం బండి సంజయ్, అర్వింద్ వంటి బీజేపీ నేతలు నోరు మెదపరు..2 కోట్ల ఉద్యోగాలు ఏమైంది అంటే తెలంగాణలో ఉద్యోగాలు లేవంటూ వితండ వాదం చేస్తూ…ఎదురుదాడికి దిగడం బీజేపీ నేతలకు అలవాటుగా మారింది. అయితే తాజాగా ఉద్యోగాల విషయంలో మోదీ సర్కార్‌పై ట్విట్టర్ వేదికగా నిరుద్యోగ యువత చేస్తున్న యుద్ధం బీజేపీ నేతలకు షాక్ ఇస్తోంది. మోదీ ఉద్యోగమివ్వు’ (మోదీ రోజ్‌గార్ దో/మోదీ జాబ్ దో) అంటూ కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున నినదిస్తున్నారు. గత వారం రోజులుగా ట్విట్టర్‌లో ‘మోదీ.. ఉద్యోగమివ్వు’ అనే హ్యాష్‌ట్యాగే టాప్ ట్రెండింగ్‌లో ఉంది. గురువారం ఒక్క రోజే ఈ హ్యాష్‌ట్యాగ్‌పై సుమారు 50 లక్షల ట్వీట్లు వచ్చాయి.

ఇంకా పెద్ద సంఖ్యలో ట్వీట్లు పడుతూనే ఉన్నాయి. క్షణాల్లో వేల సంఖ్యలో ట్వీట్లు వేస్తున్నారు. ఈ అంశం కొద్ది రోజులుగా ట్విట్టర్‌ను కుదిపివేస్తోంది. నరేంద్రమోదీ 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలంటూ ఇచ్చిన హామీని ప్రధానంగా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే కాకుండా మన్మోహన్ హయాంలో నిరుద్యోగం గురించి మోదీ చేసిన ట్వీట్లను, వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఆదాయ ఆర్జన కోసం పకోడీలు వేసుకొమ్మని మోదీ చేసిన వ్యాఖ్యలపై మీమ్స్ వేస్తూ నిరసన తెలుపుతున్నారు. . ‘యువత మన్‌ కీ బాత్ వినండి’, ‘ప్రసంగాలు, వాగ్దానాలు కాదు ఉద్యోగాలు ఇవ్వండి’ అంటూ ట్వీట్ల వరద పారిస్తున్నారు. మొత్తంగా 2 కోట్ల ఉద్యోగాల హామీని నెరవేర్చకుండా మోదీ చేసిన మోసాన్ని యువతీ, యువకులు ఎండగడుతున్నారు. ట్విట్టర్ వేదికగా యుద్ధమే చేస్తూ బీజేపీ ముక్త భారత్‌ అంటూ నినదిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ…కేసీఆర్ సర్కార్‌పై అబద్ధపు ప్రచారాలు చేస్తూ యువతను రెచ్చగొడుతున్న బండి సంజయ్‌ ఓ సారి ట్విట్టర్‌‌ చూడమని తెలంగాణ యువత కోరుతోంది. 2 కోట్ల ఉద్యోగాలంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన మోసంపై యువత ఏ స్థాయిలో నిరసన తెలుపుతుందో చూస్తే బండి సిగ్గుతో తలదించుకుంటారని నెట్‌జన్లు అంటున్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా బీజేపీ హఠావో..దేశ్ బచావో నినాదం ఊపందుకుంటోంది. మరి ఈ వార్త చూసిన తర్వాత బండి సంజయ్ తల ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి.

- Advertisement -