సాగర్‌లో చేతులెత్తేసిన బండి….!

185
Bandi
- Advertisement -

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో పోటీకి ముందే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తుండగా…టీఆర్ఎస్ అభ్యర్థిని చివరినిమిషంలో ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. సాగర్‌లో ఎలాగైనా గెలిచి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో వచ్చిన గెలుపు గాలివాటం కాదని నిరూపించాలని బండి సంజయ్ పట్టుదలగా ఉన్నాడు. అయితే అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం సిట్టింగ్‌ స్టానాన్ని నిలుపుకుని బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ సాగర్‌‌లో జానారెడ్డిని ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో ఎమ్మెల్సీ తేరాచిన్నపురెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, బాలరాజు యాదవ్, బడుగుల లింగయ్య యాదవ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే వీరిలో స్థానికుడైన ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఉప ఎన్నికల గురించి కాకుండా భవిష్యత్తులో సాగర్‌‌ను గులాబీ కంచుకోటగా మార్చేందుకు సీఎం కేసీఆర్ తేరా చిన్నపురెడ్డి వైపు మొగ్గుచూపుతున్నట్లు గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం తన క్లాస్‌మేట్ ఎంసీ కోటిరెడ్డికి సాగర్‌ టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. సాగర్ ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ రాగానే నామినేషన్ల గడువులోపు చివరినిమిషంలో అభ్యర్థిని ప్రకటించి బీజేపీకి అవకాశం ఇవ్వకూడదని టీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ వేసిందని టాక్. మరోవైపు సాగర్‌లో బీజేపీకి బలమైన అభ్యర్థులు లేక బండి సంజయ్ సతమతమవుతున్నాడు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని లేకుంటే ఆయన కుమారుడు రఘువీరారెడ్డిని పార్టీలో చేర్చుకుని పోటీ చేయించాలన్న బండి ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఇక్కడ బీజేపీ టికెట్‌ కోసం నివేదితారెడ్డి, కడారి అంజయ్య యాదవ్‌లు పోటీ పడుతున్నారు.

కాని వారు కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులను ఎదుర్కొని గెలిచే సత్తా లేదని బండి భావిస్తున్నాడంట..అందుకే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించగానే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను తమ పార్టీలోకి లాగి టికెట్ ఇవ్వాలని బీజేపీ ఆలోచన. .మరోవైపు స్థానిక బీజేపీ నేతలు నివేదితారెడ్డి, కడారి అంజయ్య యాదవ్‌లు తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నివేదితారెడ్డి ఇటీవల గుర్రంపోడు మండలం నుంచి నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరుబాటను చేపట్టారు. అయితే నివేదితా ఉదయం ప్రారంభించిన పోరుబాటను సాయంత్రానికే ముగించింది. నివేదితారెడ్డి మొదలుపెట్టిన పోరుబాటను సాయంత్రానికి ఆమె భర్త, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి తీసుకోవడం కమలం పార్టీలో హాట్‌టాపిక్ గా మారింది.

టికెట్ రేసులో ఉన్న నివేదితారెడ్డి యాత్రను ఆపేయమంటూ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాలు జారీ చేశారంట. దీంతో టికెట్‌పై నివేదితారెడ్డి పెట్టుకున్న ఆశలు అడియాసలు అయినట్లే అని సాగర్ బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ పరిణామాలతో నివేదితారెడ్డి వర్గం పార్టీ అధిష్టానం తీరుపై మండిపడుతోంది. మరోవైపు బండి తీరుతో కడారి అంజయ్య యాదవ్ కూడా తనకు టికెట్ వస్తుందనే గ్యారంటీ లేదని ఫిక్స్ అయిపోయాడంట..దీంతో ఆయన వర్గం కూడా బండిపై ఆగ్రహంతో ఉందంట. సాగర్‌లో చివరినిమిషంలో వచ్చిన టీఆర్ఎస్ నేతకు టికెట్ ఇస్తే మాత్రం ఈ రెండు వర్గాలు ఏకమై పార్టీ ఓటమికి పని చేయాలని ఫిక్స్ అయిపోయారంట..మొత్తంగా సాగర్ ఉప ఎన్నికలలో బీజేపీకి అభ్యర్థులు కరువు అయ్యారని, సీఎం కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించిన మరుక్షణమే అసంతృప్త టీఆర్ఎస్ నేతకు కాషాయకండువా కప్పి టికెట్ ఇచ్చి ఉప ఎన్నికల బరిలోకి దించాలని బండి సంజయ్‌ వెయిట్ చేస్తున్నాడంట..సాగర్ బై ఎలక్షన్‌లో బీజేపీ అభ్యర్థి విషయమై బండి సంజయ్ అమలు చేస్తున్న వ్యూహంపై స్థానిక కాషాయ నేతలు కస్సుబుస్సులాడుతున్నారంట..

- Advertisement -