నల్గొండ ఎమ్మెల్సీలో దూసుకుపోతున్న టీఆర్ఎస్‌…!

196
palla
- Advertisement -

తెలంగాణలో మరి కొద్ది రోజుల్లో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో గట్టిపోటీ నెలకొంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, టీజేఎస్ నుంచి కోదండరామ్, తెలంగాణ ఇంటి పార్టీ నుంచి చెరుకు సుధాకర్, వామపక్షాల అభ్యర్థి విజయసారథి రెడ్డి, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు తీన్మార్ మల్లన్న, సూదగాని శంకర్‌గౌడ్ తదితరులు పోటీలో ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్‌‌కు మరో మూడు వారాల సమయం కూడా లేకపోవడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని షురూ చేశాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అందరికంటే ముందుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ తరఫున మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మండ ఎంపీ నామానాగేశ్వరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సహాయంతో పల్లా నియోజకవర్గాల వారీగా ప్రచారం చేస్తున్నారు.టీఆర్ఎస్ నిర్వహించిన అన్ని ప్రచార కార్యక్రమాలకు యువత కూడా భారీ స్థాయిలో హాజరు కావడంతో మరోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్‌ దూకుడుగా వెళ్లడంతో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయన కూడా ప్రచారంలో దిగారు. ఆ పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డితో కలిసి ప్రచారంలో స్పీడ్ పెంచారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ మాత్రం నామమాత్రంగానే ప్రచారం నిర్వహిస్తున్నారని ఆ పార్టీకి చెందిన నేతలు అంటున్నారు.

ఇటీవల ఖమ్మం కేంద్రంలో ఇటీవల జరిగిన అన్ని జిల్లాల డీసీసీ సభ్యుల సమావేశానికి రాష్ట్రస్థాయి నేతలు హాజరుకావడం, మీటింగ్ కూడా సక్సెస్ కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయస్థాయి నేతల్లో జోష్ పెరిగింది. అయితే తీరా ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికల ప్రచారానికి అతిరథ కాంగ్రెస్ నేతలెవ్వరూ రాకపోవడంతో క్యాడర్‌ ఆందోళన చెందుతోంది. పైగా కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌ స్థానికేతరుడు కావడం ఆయనకు పెద్ద మైనస్. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా పీసీసీ పదవి కోసం కొట్టుకునే పనిలో బిజీగా ఉండి ప్రచారంకు డుమ్మాకొడుతున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పూర్తిగా వెనుకబడిపోయింది. ప్రస్తుతం రాములు నాయక్ గెలుపు సంగతి పక్కన పెడితే..కనీసం ఆశించిన స్థాయిలో ఓట్లు రాకుంటే పార్టీ పరిస్థితి ఏంటని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక యువ తెలంగాణ అభ్యర్థి రాణి రుద్రమ, తెలంగాణ జనసమితి అభ్యర్థి కోదండరామ్, వామపక్షాల అభ్యర్థి విజయసారథి, ఇంటి పార్టీ అభ్యర్థి చెరుకు సుధాకర్‌తో పాటు తీన్మార్ మల్లన్న వంటి పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరికి వారు తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అభ్యర్థులు చాలా మంది బరిలో ఉండడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఆందోళన నెలకొంది.. కోదండరామ్ నిరుద్యోగ యువతపై ఆశపెట్టుకున్నారు. కాని యువతను ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తీన్మార్ మల్లన్న భారీగా చీల్చడంతో బీజేపీ అభ్యర్థి, ప్రేమేందర్ రెడ్డికి, కోదండరామ్‌‌కు ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్, ఇండిపెండెంట్ల మధ్య ఓట్లు చీలి మళ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఇక్కడ గెలుపెవరిది అని తెలియాలంటే మరో మూడు వారాలు ఆగాల్సిందే.

- Advertisement -