హాలియా మున్సిపాలిటీలోని అనుములకు మిషన్ భగీరథ మంచినీరు వందకు వంద శాతం సరఫరా అవుతున్నదని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఆ ఊరిలో పెద్దలు జానారెడ్డి ఇల్లు ఉందా? అమ్ముకున్నారా? అనేది వారికి సంబంధించిన విషయమని, ఆ గ్రామంలో మంచినీరు సరఫరా జరుగుతున్నదా? లేదా అన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. రెండు రోజుల క్రితం ప్రధాన రహదారి వద్ద జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా మిషన్ భగీరథ మంచినీటీ సరఫరాలో అంతరాయం ఏర్పడిన మాట నిజమేనన్నారు. కానీ, సాధ్యమైనంత వేగంగా మిషన్ భగీరథ అధికారులు ఆ సమస్యను పరిష్కరించారని, ఆ వెంటనే మంచినీటి సరఫరాను ప్రారంభించారని మంత్రి వివరించారు.
ఇదే విషయాన్ని హాలియా మున్సిపాల్టీ చైర్ పర్సన్ వి. పార్వతమ్మ తమ లాగ్ షీట్‌లో లిఖిత పూర్వకంగా పేర్కొన్నారని మంత్రి ఉటంకించారు. నీటి సరఫరాల్లో అంతరాయాలు, మరమ్మతులు రావడం సాధారణమేనని, అలాగని ప్రతీ విషయాన్ని రాద్ధాంతం చేయాల్సి పని లేదని, పెద్దలు జానారెడ్డి వంటి సీనియర్ రాజకీయ నాయకులు, అనుభవజ్ఞులకు ఇంతకంటే చెప్పాల్సిందేమీ లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.