ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ నెల 20న నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశం జరగనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో సాధించిన విజయాలను తెలుపుతూ సంక్షిప్త నివేదికలను సిద్దం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత అధికారులతో జరిపిన సమావేశంలో ఆ నివేదికను ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి సమర్పించాల్సివుందన్నారు.
నీతి ఆయోగ్ ఆదేశానుసారం, రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో సాధించిన ఫలితాలపై ప్రగతి నివేదికలను సిద్దం చేయాలని , ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు మరియు విధానాలను ఆ నివేదికలలో పేర్కొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. నీతి ఆయోగ్ కోరిన విధంగా రాష్ట్రంలో విజయవంతంగా అమలు అవుతున్న టి.ఎస్. ఐ-పాస్, కె.సి.ఆర్ కిట్స్, రైతు బంధు మరియు రైతు భీమా పథకాలను ఆ నివేదికలలో చేర్చాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో కార్మిక, ఉపాది శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి రాణి కుముదిని, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కె.రామకృష్ణారావు, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్ , ఐటి ముఖ్యకార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ బి.జనార్దన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రిజ్వీ , సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ శ్రీ నవీన్ మిత్తల్ , గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా చోంగ్తు మహిళా,శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దివ్య తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.