దేశ వ్యాప్తంగా నేటి నుంచి జాతీయ రహదారులపై ఫాస్టాగ్ అమల్లోకి వచ్చింది. అన్ని టోల్ ప్లాజాల్లో పూర్తిగా నగదు రహితంగా నడవనున్నాయి. ఫాస్టాగ్ లేకుండా టోల్ ప్లాజాల్లోకి వాహనాలను అనుమతించరు. ట్యాగ్ లేని వాహనాలకు టోల్ ఫీజు భారం రెట్టింపు కానుంది.
నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ లేని వాహనాలు, చెల్లుబాటు కాని ఫాస్టాగ్ ఉన్న వాహనాలు గానీ ఫాస్టాగ్ లేన్‌లోకి వచ్చిన పక్షంలో రెట్టింపు ఫీజు వర్తిస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ వివరించింది.2016లో తొలిసారిగా ఫాస్టాగ్‌లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1 నుంచి ఫోర్ వీలర్ ప్యాసింజర్ వాహనాలు, గూడ్స్ వాహనాలకు ఫాస్టాగ్ అమర్చడాన్ని తప్పనిసరి చేసింది. ఆ తర్వాత డెడ్‌లైన్‌ను ఫిబ్రవరి 15 దాకా పొడిగించింది.
దేశంలోని 2.54 కోట్ల మందికి పైగా వాహనదారులు ఇప్పటికే ఫాస్టాగ్ ను పొందారు వాహనదారుల ఫాస్టాగ్ అకౌంట్లో టోల్ చార్జి చెల్లించేందుకు తగిన డబ్బులేకున్నా పేమెంట్ ప్రాసెస్ ను పూర్తి చేయాలనీ, ఫాస్టాగ్ అకౌంట్లో నెగిటివ్ బ్యాలెన్స్ ఏర్పడితే, తదుపరి రీచార్జ్ నుంచి మినహాయించుకోవచ్చునని తెలిపింది. గతంలో ఫాస్టాగ్ ఖాతా నెగిటివ్ లో ఉన్నట్టయితే వారిని టోల్ గేట్ల నుంచి అనుమతించకపోయేవారు.