‘లక్ష్మీ’, ‘లక్ష్యం’, ‘రేసు గుర్రం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ అధినేత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) తాజాగా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నారు. ఎన్టీఆర్ తో ‘అదుర్స్’ నిర్మించిన శాసన సభ్యుడు వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించనున్నారు. నల్లమలుపు బుజ్జి నిర్మించిన ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘రేసు గుర్రం’ చిత్రాలకు స్ర్కీన్ ప్లే రచయితగా వ్యవహరించిన విక్రమ్ సిరి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ చిత్రానికి నంది అవార్డు కూడా అందుకున్నారు విక్రమ్ సిరి. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు.
త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మాట్లాడుతూ – ”రవితేజ హీరోగా మా సంస్థలో ఇది మొదటి సినిమా. మంచి కథ కుదిరింది. వక్కంతం వంశీ పవర్ ఫుల్ ఎనర్జిటిక్ స్టోరీ తయారు చేశారు. శాసన సభ్యుడైన వల్లభనేని వంశీతో కలిసి ఈ సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తేలియజేస్తాం” అని చెప్పారు.ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కొల్లి రాజేష్.