సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం-మంత్రి సత్యవతి

122
Minister Satyavathi
- Advertisement -

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఈరోజు మంత్రి సత్యవతి శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీశైలం దేవాలయంలో మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రజలకోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి మరింత శక్తినివ్వాలని స్వామి వారిని ప్రార్ధించానని మంత్రి అన్నారు.

అలాగే తెలంగాణలో సీఎం మార్పుపై ప్రశ్నించగా.. మంత్రి కేటీఆర్ సీఎం ఎప్పుడవ్వాలనేది టీఆర్‌ఎస్‌ పార్టీ అంతర్గత విషయమని, ఎవరికి ఏ పదవులు ఇవ్వాలనే విషయాన్ని సీఎం కేసీఆర్‌ నిర్ణయిస్తారని చెప్పారు. సీఎంగా ఎవరుండాలనే విషయంపై కాంగ్రెస్‌, బీజేపీలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో అతితక్కువ మెజారిటీతో గెలిచిన బీజేపీ దానిని బలుపుగా భావించి ఎగిరిపడుతున్నదని విమర్శించారు. సాగర్ ఉపఎన్నికల్లో బీజేపీది బలుపో, వాపో తేలిపోతుందన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -