కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు అంతర్జాతీయ సెలబ్రెటీలు రైతులకు మద్దతుగా తెలుపుతున్నారు. ఈ జాబితాలో బ్రిటిష్ నటి జమీలా జమిల్ కూడా ఉన్నారు. అయితే, ఆమె రైతులకు మద్దతు తెలిపినప్పటి నుంచి అత్యాచార బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది. ఈ మేరకు జమీలా తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు చేసింది.
కొన్ని నెలలుగా తాను తరచుగా భారతీయ రైతులకు మద్దతు తెలుపుతున్నానని ఆమె చెప్పింది. అయితే, ఈ నేపథ్యంలో తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని, తనను చంపేస్తామని, అత్యాచారం చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని చెప్పింది. ఇటువంటి బెదిరింపులకు పాల్పడేవారు ఓ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆమె కోరింది. తానూ మనిషినేనని, కొంతవరకే దేన్నయినా భరించగలనని తెలిపింది. భారత రైతులకు తాను సంఘీభావం తెలుపుతున్నానని, భవిష్యత్తులోనూ తెలుపుతానని స్పష్టం చేసింది. తమ న్యాయమైన హక్కుల కోసమే రైతులు పోరాడుతున్నారన్న విషయాన్ని గుర్తించాలని ఆమె తెలిపింది.