తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందంటూ కొన్ని నెలలుగా పలువురు టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఈ రోజు ఉదయం ఆయన కుటంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
దేవుడి కృప, ఆశీస్సులతో కేటీఆర్ సీఎం అవుతారన్నారు. అన్నింటికి సమయం, సందర్భంగా రావాలన్నారు. ఎప్పుడు ఏం జరగాలో సీఎం కేసీఆర్, పార్టీ సమష్టి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలకు సుభిక్షపాలన అందిస్తున్న సీఎం కేసీఆర్కు బంగారు తెలంగాణ సాధనకు మరింత శక్తిని ఇవ్వాలని స్వామి వారిని ప్రార్థించినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.