నాన్ బెయిలబుల్ వారెంట్‌పై దర్శకుడు శంకర్‌ క్లారిటీ..

230
Director shankar
- Advertisement -

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ నటించిన రోబో చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా దర్శకుడు శంకర్‌.. ర‌చ‌యిత అరుర్ త‌మిళ్‌నంద‌న్ రచించిన జిగుబా క‌థను కాపీ కొట్టి ఆ సినిమా తీసార‌ని,ఈ క్ర‌మంలో ఆయ‌న‌పై చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిట‌న్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైనట్లు వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన‌ట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు విన్న దర్శకుడు శంక‌ర్ అవాకయ్యారు.

దీనిపై దర్శకుడు శంకర్ స్పందించారు. తనపై వారెంట్ జారీ అయిందంటూ మీడియాలో వచ్చిన వార్తలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని తెలిపారు. తన న్యాయవాది సాయి కుమరన్ ఇదే విషయమై చెన్నైలోని ఎగ్మూర్ మెట్రోపాలిట్ మేజిస్ట్రేట్ కోర్టును సంప్రదిస్తే, ఎలాంటి వారెంట్ జారీ చేయలేదని చెప్పారని శంకర్ వివరించారు. కోర్టు ఆన్ లైన్ వ్యవహారాల్లో తప్పిదం కారణంగా వారెంట్ అంటూ ప్రచారం జరిగి ఉండొచ్చని, ఇప్పుడా పొరబాటును దిద్దుతున్నారని శంకర్ తెలిపారు.

కానీ, ఎలాంటి నిర్ధారణ లేకుండానే తప్పుడు వార్తలు ప్రసారం కావడం తనను విస్మయానికి గురిచేసిందని తెలిపారు. ఈ పరిస్థితి కారణంగా తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అనవసరంగా వేదనకు గురయ్యారని వెల్లడించారు. దయచేసి తన తాజా ప్రకటనను మీడియా సంస్థలన్నీ మరింత ముందుకు తీసుకెళ్లి, తప్పుడు వార్తలు మరింత వ్యాప్తి చెందకుండా వుండాలని శంకర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -