ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున మొక్కలు నాటాలి- ఎంపీ సంతోష్

208
mp j santosh
- Advertisement -

ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజునాడు విధిగా మూడు మొక్కలు నాటి, వాటిని కన్నబిడ్డల్లా సంరక్షించాలని రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమ నిర్వాహకులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సిటీ కళాశాల (హైదరబాద్) తెలుగు శాఖ ఆధ్వర్యంలో జూమ్ అంతర్జాల వేదికలో జరిగిన వృక్షవేదం పరిచయ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించిన హరితహారం స్ఫూర్తితో తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్నినిర్వహిస్తున్నానని, మహోన్నతమైన హరితహారం లక్ష్యాలను,ఆశయాలను ఆచరణాత్మకంగా ముందుకు తీసుకువెళ్లడమే తన ధ్యేయమని చెప్పారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హరితహారం కార్యక్రమాన్నికేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్‌తో పాటు జాతీయ,అంతర్జాతీయ ప్రముఖులు ప్రశంసించారని అన్నారు.భారతదేశ పర్యావరణ ఉద్యమానికి హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలు సరికొత్త ఉత్తేజాన్ని అందించాయని సంతోష్ కుమార్ వివరించారు.

కీసర అడవీప్రాంతాన్ని తాను దత్తత తీసుకొని కోట్లాది రూపాయలు వెచ్చించి,ఆ ప్రాంతన్నిఅభివృద్ధిచేశానని,ఈ స్ఫూర్తితో ఎంతోమంది ముందుకు వచ్చి ఈ కృషిలో స్వచ్చందంగా పాల్గొంటున్నారని అన్నారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం పట్ల యువత,విద్యార్థులు త్వరగా ఆకర్షితులు కావటానికే తాను ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ సినిమా హీరోలను,రాజకీయ ప్రముఖులను,అంతర్జాతీయ క్రీడాకారులను ఇందులో భాగస్వాములను చేశానని సంతోష్ కుమార్ అన్నారు. త్వరలో భారత ప్రధానమంత్రి,రాష్ట్రపతి కూడా గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించేలా తాను విజ్ఞప్తి చేస్తానని సంతోష్ కుమార్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రభుత్వ కళాశాలల ప్రాంగణాలను ఆకుపచ్చని వనాలుగ తీర్చిదిద్దాలని కళాశాల విద్య అధికారులకు ఆయన సూచించారు.రేపటితరం భద్రమైన భవిష్యత్తు కోసం ఈ తరాన్ని పచ్చదనం వైపు నడిపించాలని పిలుపునిచ్చారు.కళాశాల విద్యార్థులు హరిత సైనికుల్లా ముందుకు కదిలి పుడమి తల్లి ఆరోగ్యాన్నికాపాడాలని సూచించారు. ప్రతి విద్యార్థి మొక్కను నాటి,ఆ సెల్ఫీని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయాలని చెప్పారు.

పర్యావరణ విద్యను తప్పనిసరి పాఠ్యాంశంగా చేర్చాలని సంతోష్ కుమార్ సూచించారు. డా.బాబాసాహెబ్ అంబేడ్కర్,గాంధీ లాంటి నాయకులు చెట్టు నాటుతున్నచిత్రాలను కరన్సీ నోట్ల మీద ముద్రిస్తే అందరికీ ప్రేరణగా ఉంటుందని ఆయన సూచించారు.గ్రీన్ఇండియా ఛాలెంజ్ ఆశయాలను అక్షరబద్ధం చేయాలనే లక్ష్యంతో వృక్షవేదం గ్రంథాన్ని వెలువరించినట్లు చెప్పారు.ప్రాచీనవాఙ్మయలోని వన సంరక్షణాఎరుకను,పర్యావరణ సాహిత్యాన్నివృక్షవేదం గ్రంథం ద్వారా విశ్వానికి చాటి చెప్పామని ఆయన వివరించారు.వృక్షవేదం పర్యావరణ ఉద్యమానికి ప్రాణ చైతన్యాన్నిఅందిస్తుందని సంతోష్ కుమార్ వివరించారు. ఎంతో విలువైన వృక్షవేదం పుస్తకాన్ని రూపొందించటంలో విశేషంగా కృషి చేసిన ఈ గ్రంథ సంపాదకుడు ప్రముఖ కవి గాయకులు దేశపతి శ్రీనివాస్‌ను, ఇందుకు సహకరించిన ప్రముఖ విమర్శకులు నారాయణశర్మను ఎం‌.పి సంతోష్ కుమార్ అభినందించారు.

సిటీ కళాశాల ను దత్తత తీసుకుంటా..
వంద సంత్సరాల ఘనచరిత్ర కలిగిన సిటీ కళాశాలను తాను దత్తత తీసికొని,ప్రభుత్వ సహకరంతో అభివృద్ధి చేస్తానని సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు. పర్యావరణపునరంకిత సభను నిబద్ధతతో నిర్వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డా.విజయలక్ష్మిని,తెలుగు శాఖ అధ్యాపకవర్గాన్నిసంతోష్ కుమార్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖకవి, ప్రజాగాయకులు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ఒక తాత్త్వికభూమికను ఏర్పరచాలనే ఉద్దేశంతో వృక్షవేదం పుస్తకాన్ని ప్రచురించినట్లు తెలిపారు.మనిషికి జీవించే హక్కు ఉన్నట్లు గానే చెట్టుకు కూడా జీవించే హక్కు ఉంటుందని,ఆ పవిత్రమైన హక్కును అందరూ కాపాడాలని అన్నారు.ప్రకృతిలో మమేకమై జీవించే నైజన్నిఅలవరుచుకోవాలని చెప్పారు. వృక్షాలను నరకటం కూడా ఒక రకమైన హత్య అని దేశపతి శ్రీనివాస్ అన్నారు. వృక్షఫలాలను ఆరగిస్తూ,చెట్టుకు చేటు చేస్తే,ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటుందని ఆయన హితవు పలికారు. ప్రాచీనసాహిత్యం అద్భుతమైన వన వర్ణనలతో నిండివుందని,అమూల్యమైన ఆ సారస్వత సంపదను,ఆ హరిత విలువలను ఈ తరం అందిపుచ్చుకోవాలని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలంజ్ ఒక చారిత్రాత్మకమైన ఆకుపచ్చని ఉద్యమానికి నాంది పలికిందని ఆయన విశ్లేషించారు.

ఈ పర్యావరణ పునరంకిత సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న వనజీవి రామయ్య మాట్లాడుతూ.. ఆట పాటల ద్వారా చెట్ల ప్రాముఖ్యతను బాల్య దశ నుండే విద్యార్థులకు ప్రబోధించాలని సూచించారు. బంగారు తెలంగాణతో పాటు ఆరోగ్య తెలంగాణ నిర్మించాలని అన్నారు. వృక్షవేదం పుస్తకాన్నివిద్యార్థులు విధిగా అధ్యయనం చేయాలని అన్నారు. కరన్సీ నోట్లపై చెట్టు నాటుతున్నబొమ్మను ముద్రిస్తే నిరక్షరాస్యుల్లో కూడా పర్యావరణ స్పృహ కలుగుతుందని చెప్పారు.

ప్రభుత్వ సిటీ కళాశాల ప్రిన్సిపాల్ డా .వి విజయలక్ష్మి అద్యక్షత వహించిన ఈ సదస్సులో కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ డా.యాదగిరి,రీజినల్ డైరెక్టర్ డా.రాజేంద్రసింగ్ ,అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డా.ఘన్ శ్యామ్, ప్రముఖ విమర్శకులు,నారాయణశర్మ,వైస్ ప్రిన్సిపాల్ డా.విప్లవదత్ శుక్లా, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహాయాచార్యులు డా.వి.శంకర్ తెలుగు శాఖ అధ్యక్షులు అవధానం సుజాత,తెలుగు శాఖ సహాయాచార్యులు డా.నీరజ,డా.కోయి కోటేశ్వర రావు, అనంతలక్ష్మి, కేథరిన్,డా.కమల సుధారాణి, అధ్యాపకవర్గం,విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవితలపోటీలో విజేతలుగా నిలిచిన సిటీ కళాశాల విద్యార్థిని శ్రీనిధి, కరీమ్ నగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని హేమలత తమ కవితలను వినిపించి అధికారులప్రశంసలు అందుకున్నారు.

- Advertisement -