గురుకులాల చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం: మంత్రి

118
minister koppula

హైదరాబాద్ నగరంలోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో జరిగిన కార్యక్రమంలో జాతీయ పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఎంబిబిఎస్,ఐఐటి,ఎన్ఐటి సీట్లు సాధించిన విద్యార్థుల అభినందన సభ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటైంది.

ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులను అభినందిస్తూ, గురుకుల విద్యాలయాల చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయమన్నారు. ఎస్సీ ,ఎస్టీ, బిసి విద్యార్థులను సిద్ధం చేయడానికి ఉచిత దీర్ఘకాలిక ఇంటెన్సివ్ కోచింగ్ కార్యక్రమాలను ఆమోదించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్పోరేట్ విద్యాసంస్థలకు ధీటుగా గురుకులాలలో బోధన కొనసాగుతున్నదని, విద్యతో పాటు వివిధ అంశాలలో గొప్పగా రాణిస్తున్నారని విద్యార్థినీ,విద్యార్థులను అభినందించారు. జాతీయ పోటీ పరీక్షలలో మన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ముఖ్యమంత్రి ఈ సంస్థలను ప్రోత్సహిస్తున్నారని కొప్పుల చెప్పారు. మన దేశంలోని విద్యా రంగంలోనే ఇది అసామాన్యమైనదని, దేశం మొత్తం తెలంగాణ గురుకులాల వైపు చూస్తున్నాయన్నారు. మనం ఏ వర్గం నుండి వచ్చామో, ఆ వర్గానికి సేవ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈశ్వర్ విద్యార్థులకు హితవు పలికారు.

ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం దేశంలోని కష్టతరమైన ఐఐటి-జెఇఇ, నీట్ ప్రవేశ పరీక్షలలో ప్రతిభ కనపరిచి 135 మంది పేద విద్యార్థుల కల నిజమైందన్నారు.సంక్షేమ విద్యాలయాల చరిత్రలోనే తొలిసారిగా 80 మంది విద్యార్థులు ఐఐటి, ఎన్‌ఐటిలలో ప్రతిభ కనపరిచి సీట్లు సాధించగా, ఈ ఏడాది ఎంబిబిఎస్‌లో 135 మంది విద్యార్థులకు సీట్లు లభించాయని వివరించారు. టాపర్లందరూ మొదటి తరం విద్యార్థినీ, విద్యార్థులని,వీరంతా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినవాళ్లని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జాతీయ పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు 50వేల రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు.విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.అంతకుముందు షేక్ పేట ఎస్సీ గురుకుల పాఠశాలలో మంత్రికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా యూత్ పార్లమెంట్,యుఎన్వో సదస్సులో మంత్రి కొప్పులఈశ్వర్ విద్యార్థులను ఉద్దేశించి ఉత్తేజిత ప్రసంగం చేశారు.