మద్దతు ధరతో కూరగాయలు కొనేందుకు సిద్ధం: సీఎం కేసీఆర్

138
telangana cm
- Advertisement -

అవసరమైతే రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే మద్దతు ధరతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలోని ములుగు మండలంలో గల వంటిమామిడి మార్కెట్ యార్డ్ ‌ను బుధవారం కేసీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మార్కెట్ కు ఆలుగడ్డలు తీసుకువచ్చిన నెంటూర్ గ్రామానికి చెందిన కిచ్చుగారి స్వామి, బంగ్లా వెంకటాపుర్ చెందిన రైతులతో సీఎం మాట్లాడారు. ఆలుగడ్డలు ఎంత ధరకు అమ్ముడుబోతున్నాయో, వాటికి ఎంత పెట్టుబడి పెట్టారు, గిట్టుబాటు ధర ఎంత వస్తుందో వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి కేవలం నాలుగు శాతం మాత్రమే కమీషన్ తీసుకోవాలని కమీషన్ ఏజెంట్లకు సీఎం సూచించారు.

ఎవరూ కూడా రైతులను ఇబ్బంది పెట్టకూడదని పేర్కొన్నారు. మార్కెట్ కు అనుబంధంగా కూరగాయల నిల్వ కోసం 50 ఎకరాల భూమిలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని రైతులకు సీఎం హామీ ఇచ్చారు. మార్కెట్ విస్తరణ కోసం 14 ఎకరాల భూమిని చిన్నతిమ్మాపూర్ గ్రామపంచాయతీ నుంచి తక్షణమే సేకరించాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. చిన్న తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి 4 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో సీఎం వెంట రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పళ్ల రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి, ఏఎంసీ చైర్మన్, టీఆర్ఎస్ నాయకులు, రైతులు, తదతరులు పాల్గొన్నారు.

- Advertisement -