మనమంతా రైతు కుటంబాల నుంచే వచ్చాం. ఇంత కరోనా కష్ట కాలంలోనూ రైతు బంధు అందచేస్తున్నామని.. రైతులకు రైతు బీమా చేస్తున్నాం అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన పంచాయతీ రాజ్ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డిలు హాజరైయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పంచాయతీలకు డబ్బులు ఇస్తున్న సంగతిని మంత్రి గుర్తు చేశారు. దీంతో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి నెలా.. కనీసం రూ.5లక్షల నుంచి 50 లక్షల వరకు నిధులు నిలువ వుంటున్నాయని మంత్రి తెలిపారు. గతంలో సర్పంచ్ ల పరిస్థితి దారుణంగా ఉండేదని, ఇప్పుడా పరిస్థితులను మార్చివేసి, స్థానిక సంస్థలను బలోపేతం చేసి, నిధులు ఇస్తూ, గ్రామాలను అన్ని విధాలుగా, అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు.