సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వద్ద పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్.సి రాజమౌళితో కలిసి కొండపోచమ్మ రిజర్వాయర్ పర్యటనకు ఆయన వెళ్లారు.
ఈ సందర్భంగా రిజర్వాయర్‌ను పరిశీలించారు. రిజర్వాయర్ వద్ద పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు ఏం చేయాలన్న దానిపై చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమంతో పాటు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద 10 ఎకరాల్లో టూరిజం హబ్‌గా చేయాలని అనుకుంటున్నామన్నారు. బోటింగ్‌తో పాటు రిసార్ట్, పార్క్ ఏర్పాటు చేసి టూరిస్టులకు అన్నివిధాల బాగుండేలా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

దీంతో పాటు గజ్వేల్ లో కూడా టూరిజం స్పాట్స్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కోమరవెళ్లి, కొండపోచమ్మ, వేములవాడ మీదుగా ప్రత్యేక టూరిజం బస్సులు పెడతామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అందరం కష్టపడి పనిచేస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. వీటితో పాటు నాచారం గుట్ట నరసింహ స్వామి ఆలయం వద్ద రెస్టారెంట్ ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రం పర్యటకంగా అన్నివిధాల ముందుకు వెళుతోందన్నారు. రిజర్వాయర్ పరిశీలన అనంతరం మర్ కూక్లో రంగనాయక స్వామి ఆలయం, హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కి ఉద్దీన్, జెడ్పీటీసీ రామచంద్ర, కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, మెట్టయ్య, బాలమని శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ పాండు గౌడ్, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


