ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం..

170
Sonia Gandhi
- Advertisement -

ఢిల్లీలో శుక్రవారం కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ ప్ర‌త్యేక స‌మావేశం జరిగింది. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగియగా.. సుమారు మూడు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. కాగా,పార్టీకి శాశ్వత అధ్య‌క్షుడి ఎన్నికే ప్ర‌ధాన అంశంగా ఈ స‌మావేశం జ‌రుగుతున్న‌ట్లు తెలిస్తోంది. అదేవిధంగా పార్టీలో సంస్థాగత ఎన్నికల, ఏఐసీసీ ప్లీనరి సమావేశాల షెడ్యూల్ ఖ‌రారు త‌దిత‌ర అంశాల‌పై కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చించినట్లు స‌మాచారం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ ఈ స‌మావేశంలో వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. అలాగే రైతుల ఆందోళ‌న‌ల‌తో పాటు క‌రోనా మ‌హ‌మ్మారిపై ఆమె కొన్ని వ్యాఖ్య‌లు చేశారు.

2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్య‌త‌ల‌ను రాహుల్ గాంధీ త్య‌జించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత పార్టీ చీఫ్‌గా మ‌ళ్లీ సోనియా గాంధీ ప‌గ్గాలు చేప‌ట్టారు. కానీ ఇటీవ‌ల ఆ పార్టీలో సీనియ‌ర్లు సోనియాకు వ్య‌తిరేకంగా గ‌ళం ఎత్తారు. ఈ నేప‌థ్యంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ త్వ‌ర‌లోనే ఏఐసీసీ ప్లీన‌రీ నిర్వ‌హించ‌నున్న‌ది.

కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్య‌క్షుడి ఎన్నిక కోసం మే నెల‌లో ఏఐసీసీ ప్లీన‌రీ నిర్వ‌హించ‌నున్న‌ది. మే 15వ తేదీ నుంచి మే 30వ తేదీ మ‌ధ్య ఆ స‌మావేశాలు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ది. ఏఐసీసీ ప్లీన‌రీ మే 29వ తేదీన జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఓ మీడియా సంస్థ పేర్కొన్న‌ది. అయితే ఫిబ్ర‌వ‌రిలోనే పార్టీ అంత‌ర్గ‌త ఎన్నిక‌లు నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కూడా తెలుస్తోంది. మేలో జ‌రిగే ప్లీన‌రీ స‌మావేశాల్లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

- Advertisement -