బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఆదివారం మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో సూత్రధారి అయిన మాదాల సిద్దార్థ అండ్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. అఖిలప్రియకు మాదాల సిద్దార్థ కిడ్నాప్ గ్యాంగ్‌ను సప్లై చేశాడని తెలస్తోంది. వీరిని విచారించి కిడ్నాప్‌కు సంబంధించిన పలు విషయాలను రాబట్టనున్నట్లు సీపీ తెలిపారు. కేసులో ప్రధాన నిందితులైన భార్గవ్ రామ్, గుంటూర్ శ్రీను, జగత్ విఖ్యాత్ రెడ్డి, కిరణ్మయి, చంద్రహాస్ ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరికోసం పోలీసులు పలు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు.
ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో ఏ-1 గా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఏ-2గా ఏవీ సుబ్బారెడ్డిని, ఏ-3 గా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌ను చేర్చారు. హాఫిజ్‌పేట భూముల విషయంలో ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
సీపీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. మాదాల సిద్దార్థ విజయవాడలో ఈవెంట్ మేనేజర్. అతడు తన స్విఫ్ట్ కారును కూడా కిడ్నాప్‌కు ఇచ్చాడు. కిడ్నాప్ కేసులో ఇప్పటి వరకు 19 మంది అరెస్ట్ అయ్యారు. సిద్దార్థకు అఖిలప్రియ రూ.5 లక్షల సుపారీ ఇచ్చారు. మిగతా 20 మందికి తలా రూ.25 వేలు ఇచ్చారు. అడ్వాన్స్‌గా సిద్దార్థకు రూ.74 వేలు ఇచ్చారు.
ఫోరమ్ మాల్ వద్ద ఎట్‌హోమ్‌లో కిడ్నాపర్లు ఉన్నారు. కిడ్నాపర్లకు గుంటూరు శ్రీను దుస్తులు సమకూర్చాడు. మొయినాబాద్‌లో బాధితుల నుంచి సంతకాలు తీసుకున్నారు. స్టాంప్ పేపర్లను మల్లికార్జున్ సంపత్ అరేంజ్ చేశాడు. జగత్ విఖ్యాత్, భార్గవ్‌రామ్ పేర్లపై ఖాళీ పత్రాలు ఉన్నాయి. కిడ్నాప్‌లో విఖ్యాత్ ఇన్నోవా కారు ఏపీ 21 సీకే 2804 వినియోగించారు. విఖ్యాత్ కారులో భార్గవ్‌రామ్, మరో నలుగురు నిందితులు ఉన్నారు. భార్గవ్‌రామ్, విఖ్యాత్‌రెడ్డి, చంద్రహాస్ ప్రధాన నిందితులు. శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రులు పరారీలో ఉన్నార’’ని తెలిపారు.