కారుణ్య నియామకాలపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలవరించింది. ఇప్పటి వరకు కారుణ్య నియామాకాల్లో మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో వారసుడిగా కొడుకును మాత్రమే గుర్తించేవారు. ఆ కుటుంబంలో కూతురు ఉంటే..అదీ పెళ్లైన కూతురు ఉంటే కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. అయితే తాజాగా అలహాబాద్ హైకోర్టు ఈ విషయంలో కీలక తీర్పు చెప్పింది.
మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో కొడుకును ఏ విధంగానైతే భాగస్వామిగా చూస్తారో పెళ్లైన కూతురిని కూడా అదే విధంగా చూడాలని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే పెళ్లైన కూతురిని కుటుంబంలో సభ్యురాలిగా భావించరాదంటూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ జిల్లా విద్యాశాఖ అధికారి జారీ చేసిన ఆర్డర్‌ను సవాల్ చేస్తూ మంజుల్ శ్రీవాత్సవ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. రీసెంట్‌గా ఈ పిటిషన్‌పై జస్టిస్ జేజే మునిర్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
కారుణ్య నియామాకాల విషయంలో మరణించిన ఉద్యోగి కుటుంబంలోని కొడుకుకు ఎంత అవకాశం ఉంటుందో అలాగే పెళ్లైన కూతురికి కూడా అంతే అవకాశం ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఇంట్లో కొడుకుకు పెళ్లైనప్పటికీ కుటుంబ సభ్యుడిగానే చూస్తారు. అతడు అన్నింటికీ అర్హుడే. మరి కూతురు విషయంలో ఎందుకు వేరుగా చూడాలనుకుంటున్నారు? అని కోర్టు ప్రశ్నించింది. పెళ్లైన కూతురు ఏదేని అభ్యర్థిత్వానికి అనర్హురాలుగా గుర్తించడం వివక్ష కిందకే వస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. గతంలో విమలా శ్రీవాస్తవ కేసులో కూడా కోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. కారుణ్య నియామకాల్లో కొడుకుకు ఉన్న అర్హతలే పెళ్లైన కూతురికి కూడా ఉంటాయని తేల్చి చెప్పింది. పెళ్లైన కూతురు కారుణ్య నియామకాలకు అనర్హురాలనడం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. మొత్తంగా కారుణ్య నియామకాల్లో మరణించిన ఉద్యోగి కొడుకుతోపాటు , పెళ్లైన కూతురు కూడా అర్హురాలే అంటూ అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.