అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అవసరమయ్యే విరాళాల సేకరణ నేటి నుండి ప్రారంభంకానుంది. రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సభ్యులు తొలి విరాళాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుండి స్వీకరించనున్నారు. తర్వాత ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి విరాళాలు సేకరించనున్నారు. ఈ నిధుల సేకరణ ఫిబ్రవరి 27వ తేదీ వరకు సాగనుంది.
దేశ వ్యాప్తంగా నిధుల సేకరణ కోసం అన్ని జిల్లాల్లో ప్రముఖ వ్యక్తులతో కమిటీలను ఏర్పాటు చేశారు. మొత్తం 40 లక్షల మంది ఇందులో పాలుపంచుకోనుండగా 13 కోట్ల కుటుంబాలకు చెందిన 65 కోట్ల మందిని కమిటీ సభ్యులు కలవనున్నారు.
ప్రజల నుండి సేకరించిన డబ్బును బ్యాంక్ ఆఫ్ బరోడాకు, ఎస్‌బీఐ, పీఎన్‌బీతో పాటు పలు బ్యాంకుల ఖాతాల్లో వేయనున్నారు. విరాళాలు ఇచ్చిన వారందరికీ రశీదులు ఇవ్వనున్నారు. రూ.10 చందా కోసం నాలుగు కోట్ల రశీదులు, రూ.100 విరాళం కోసం 8 కోట్లు, రూ.వెయ్యి విరాళానికి 12లక్షల రశీదులను ట్రస్ట్ ముద్రించింది. రూ.వేలు మించి ఇచ్చే వారికి రశీదులు ఇవ్వనున్నారు.