సింగరేణి పుట్టినిల్లయినా ఇల్లందులో సంస్థ నిర్మిస్తున్న 39 మెగావాట్ల సోలార్ ప్లాంటులో 15 మెగావాట్ల విభాగాన్ని సింగరేణి డైరెక్టర్లు శనివారం (జనవరి 9వ తేదీ) నాడు ప్రారంభించారు. తెలంగాణా ట్రాన్స్ కో అధికారుల సమక్షంలో సింక్రనైజేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. దీనిపై సంస్థ సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ తన హర్షం ప్రకటిస్తూ అధికారులకు తన అభినందనలు తెలిపారు. మొదటి దశలో ఇంకా రెండు ఏరియాల్లో మిగిలి ఉన్న 59 మెగావాట్ల ప్లాంటు విభాగాలను కూడా ఈ నెలాఖరుకల్లా పూర్తిచేసి విద్యుత్ ను అనుసంధానం చేయాలని ఆదేశించారు.
శనివారం నాటి సింక్రనైజేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ (ఫైనాన్స్ మరియు పి&పి) ఎన్.బలరామ్, డైరెక్టర్ (ఇ&ఎం) డి.సత్యనారాయణరావులు స్విచ్ ఆన్ చేసి సింగరేణి సోలార్ విద్యుత్తును 132 కె.వి.- టి.ఎస్. ట్రాన్స్ కో విద్యుత్ కేంద్రానికి అనుసంధానం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంస్థ సి&ఎం.డి.ఎన్.శ్రీధర్ సారథ్యంలో సింగరేణి వ్యాప్తంగా 300 మెగావాట్ల సోలార్ ప్లాంటులు నెలకొల్పుతున్నామనీ, ఈ ఏడాది చివరికల్లా పూర్తి స్థాయిలో అన్ని ప్లాంటుల నుండి 300 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పాదన జరుగనుందని, సింగరేణి సంస్థ సుస్థిర భవిష్యత్తు కోసం, వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా చేపడుతున్న ఈ ప్లాంటుల నిర్మాణం వలన కంపెనీకి ఏటా 120 కోట్ల రూపాయల వరకు ఆదా చేకూరనుందని తెలిపారు.
ఇల్లందు ఏరియాలో 230 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ 39 మెగావాట్ల సోలార్ ప్లాంటులో ఇప్పటికే 15 మెగావాట్ల విభాగం నుండి విద్యుత్తు ఉత్పాదన ప్రారంభం కాగా దీనిని శనివారం నాడు ట్రాన్స్ కో కు అనుసంధానం చేశారు. ఈ నెలాఖరుకల్లా మిగిలిన 24 మెగావాట్ల నిర్మాణం కూడా పూర్తయి విద్యుత్తు ఉత్పాదన ప్రారంభించనుంది.
మొదటిదశ ప్లాంటుల్లో ఇప్పటికే 70 మెగావాట్ల అనుసంధానం
సింగరేణి సంస్థ తాను నిర్మించనున్న 300 మెగావాట్ల సోలార్ ప్లాంటుల్లో మొదటి దశలో 4 ఏరియాల్లో 129 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంటుల నిర్మాణం చేపట్టింది. వీటిలో మణుగూరులోని 30 మెగావాట్ల ప్లాంటు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 10 మెగావాట్ల ప్లాంటు ఇప్పటికే పూర్తి స్థాయిలో విద్యుత్తు ఉత్పాదన ప్రారంభించాయి. కాగా రామగుండంలోని 50 మెగావాట్ల ప్లాంటులో 15 మెగావాట్ల విభాగం, ఇల్లందులోని 39 మెగావాట్ల ప్లాంటులో 15 మెగావాట్ల విభాగాలు కూడా విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించాయి. దీంతో మొత్తం 70 మెగావాట్ల సింగరేణి సోలార్ విద్యుత్ ట్రాన్స్ కో గ్రిడ్ కు అనుసంధానం అయింది. నిర్మాణం చివరి దశలో ఉన్న 59 మెగావాట్ల నిర్మాణం పనులను కూడా వేగంగా పూర్తిచేసి వచ్చెనెల 20వ తేదీ లోపు గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని అధికారులు కృషి చేస్తున్నారు.
ఈ ఏడాది చివరినాటికి మిగిలిన 2వ, 3వ దశ ప్లాంటుల నిర్మాణం
వచ్చె నెలకల్లా మొదటి దశలోని 129 మెగావాట్ల ప్లాంటులు పూర్తిస్థాయిలో విద్యుత్తు ఉత్పాదన ప్రారంభించనుండగా, 2వ దశలోని 90 మెగావాట్ల ప్లాంటులు, మూడవ దశలోని 81 మెగావాట్ల ప్లాంటులు కూడా ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సంస్థ ఛైర్మన్&ఎం.డి. ఎన్.శ్రీధర్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన నిర్మాణపు పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
2వ దశలో భూపాపల్లిలో 10 మెగావాట్ల ప్లాంటు, మందమర్రిలో 43 మెగావాట్ల ప్లాంటు, కొత్తగూడెంలో 37 మెగావాట్ల సోలార్ ప్లాంటులను నిర్మిస్తున్నారు. ఈ కాంట్రాక్టులను పొందిన ఆదాని గ్రూపు ఆధ్వర్యంలో ఇప్పటికే పనులు 50 శాతం పైగా పూర్తయ్యాయి. కాగా 3వ దశలో ప్రయోగాత్మకంగా ఓపెన్ కాస్ట్ డంపుల మీద, నీటిపైన తేలియాడే సోలార్ ప్లాంటులను నిర్మిస్తున్నారు. రామగుండం-3 ఏరియాలో ఓపెన్ కాస్ట్ పైన 22 మెగావాట్ల ప్లాంటు, డోర్లీ ఓపెన్ కాస్ట్ పైన 10 మెగావాట్ల ప్లాంటు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం పనుల కాంట్రాక్టును ఆదాని గ్రూపు దక్కించుకోగా ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. కాగా ఈ దశలో సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ రిజర్వాయర్ పై నిర్మించే 10 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్ ప్లాంటు నిర్మాణం, డోర్లీ ఓ.సి. నీటిపై తెలియాడే 5 మెగావాట్ల ప్లాంటు నిర్మాణం పనులను నోవస్ గ్రీన్ ఇన్‌ఫ్రా అనే కంపెనీ కాంట్రాక్టు ద్వారా దక్కించుకుంది. ఈ కంపెనికి ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ లలో ఈ తరహా ప్లాంటులను నిర్మించిన అనుభవం ఉంది.
ఇవి కాక చెన్నూరులో 11 మెగావాట్లు, కొత్తగూడెంలో 23 మెగావాట్ల గ్రౌండు సోలార్ ప్లాంటు నిర్మాణం కూడా 3వ దశలో చేపట్టనున్నారు. ఈ నిర్మాణాలు మొత్తం ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలన్న సంకల్పంతో కంపెనీ ముందుకు పోతోంది. 300 మెగావాట్ల సోలారు విద్యుత్తు అందుబాటులోకి వస్తే కంపెనీకి ఏటా 120 కోట్ల రూపాయల వరకు ఆదా చేకూరనుంది. తద్వారా కంపెనీకి ఆర్ధికంగా వెసులుబాటు కలగనుంది.