ఏపీ మంత్రి కొడాలి నాని అనుచరులు పేకాట శిబిరాలు నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు చేసి భారీగా నగదు, వాహనాలు సీజ్ చేసి పలువుర్ని అరెస్ట్ చేసిన విషయం విదితమే. అయితే ఈ పేకాట శిబిరాన్ని మంత్రి కొడాలి నాని నడిపిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై కొడాలి నాని మాట్లాడుతూ, పేకాట ఆడితే ఏమవుతుందని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మహా అయితే ఫైన్ వేస్తారని, ఫైన్ కట్టి మళ్లీ పేకాట ఆడుతారని అన్నారు. ఈ వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు. పేకాట ఆడించి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మంత్రి… పేకాట ఆడితే ఏమవుతుందని అంటున్నారని ఎద్దేవా చేశారు. పేకాట ఆడినవాళ్లు జరిమానా కట్టి బయటకు వస్తారని అనడానికి ఆ మంత్రికి, ఆ మాటలు వినడానికి ముఖ్యమంత్రికి సిగ్గుండాలని మండిపడ్డారు. ఒకరు బెట్టింగ్, ఒకరు హవాలా, ఒకరు పేకాట, ఒకరు బూతుల మంత్రి… ఇలాంటి మంత్రులు ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని చంద్రబాబు మండిపడ్డారు.