డ్రంక్ అండ్ డ్రైవ్,ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపినా పోలీసులు జరిమాన విధిస్తారని తెలుసు. జరిమాన చెల్లించని వారి కారు సీజ్ చేసి…అవసరమైతే జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఇదంతా వాహనదారుల రక్షణలో భాగమే. కానీ కారు నీడకు ఫైన్ వేసిన సంఘటన చూశారా..చదివింది నిజమే..రష్యాలోని మాస్కో రింగ్ రోడ్డుపై జరిగిన వింత జరిమానా కథ ఇది.
మాస్కో రింగురోడ్డుపై కారు వెళ్తుండగా.. దాని నీడ రోడ్డు మధ్యలో ఉన్న క్రాసింగ్ లైన్‌ను దాటింది. ఇదంతా ట్రాఫిక్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ రికార్డింగు ఆధారంగా కంప్యూటర్ ఆధారిత జరిమానా నోటీసు ఆ కారు యజమాని ఇంటికి చేరింది.ఓ కారు నీడ రోడ్డుపై మార్జిన్‌ను దాటిందని ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. మొదట ఏ తప్పూ చేయని తనకి జరిమానా ఎందుకు ఇచ్చారా.. అని నిర్ఘాంతపోయిన సదరు కారు యజమాని విషయం తెలుసుకొని నిర్ఘాంత పోయాడు. తన కారు గీత దాటలేదని.. ఆ సీసీ కెమెరా రికార్డులను చూపించి పోలీసులకు తెలియజేశాడు ఆ యజమాని. కారు నీడను రికార్డు చేసిన సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపం ఏర్పడటం వల్ల ఇది తలెత్తిందని అధికారులు తెలిపారు.
ఇటీవలె ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ట్రాఫిక్ పోలీసులు కారు నడుపుతూ హెల్మెట్ పెట్టుకోలేదని ఓ వాహనదారుడికి జరిమానా విధించి నాలుక కరుచుకున్నారు. శైలేందర్ సింగ్ అనే వాహనదారుడు తన కారులో నాలుగు నెలల కుమారుడ్ని తీసుకొని డాక్టర్ దగ్గరకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ శివరాజ్ సింగ్.. ఆ కారును ఆపాడు. కారు పేపర్లు చూపించాలంటూ శైలేందర్ సింగ్‌ను డిమాండ్ చేశాడు. కారు డాక్యుమెంట్లన్నీ శైలేందర్‌సింగ్ చూపించాడు. తన కుమారుడ్ని దవాఖానకు తీసుకెళ్లడానికి ఆలస్యమవుతుందని శైలేందర్‌సింగ్ చెప్పినా కానిస్టేబుల్ వినకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కారు నడుపుతూ హెల్మెట్ ధరించలేనందుకు జరిమానా విధిస్తున్నట్టు చలానాను కానిస్టేబుల్ రాసిచ్చాడు. దీనిపై ట్రాఫిక్ ఉన్నతాధికారులను శైలేందర్‌సింగ్ సంప్రదించగా.. పొరపాటు జరిగిందని ఒప్పుకొన్నారు.