పోలీస్ స్టేషన్‌లో కోహ్లీ వాడిన తొలి ఆడీ కారు..

287
kohli
- Advertisement -

టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ వాడిన తొలి ఆడీ కారు ఏడాదిగా పోలీస్ స్టేషన్ డంప్ యార్డులో పడివుంది. చాలా సంవత్సరాల నుంచి విరాట్ కోహ్లీ ఆడీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆడీ ఆర్8 వీ10 లగ్జరీ కారును ఆ సంస్థ కోహ్లీకి కానుకగా ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే.. కోహ్లీ వాడిన తొలి ఆడీ కారును 2016లో ఒక బ్రోకర్‌ ద్వారా సాగర్‌ థక్కర్‌ అనే వ్యక్తికి అమ్మేశాడు.

అది కూడా తన గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌ ఇవ్వడం కోసం సాగర్‌ థక్కర్‌.. కోహ్లి వద్ద ఆడి కారును కొనుగోలు చేశాడు. అయితే థక్కర్‌ ఒక స్కామ్‌లో భారీగా మోసం చేసి పోలీసులకు పట్టుబట్టాడు. దాదాపు రూ. 12 కోట్ల వరకూ స్కామ్‌ చేసి దొరికిపోయాడు. దాంతో అతన్ని అరెస్టు చేసిన ముంబై పోలీసులు, ఆడి కారును కూడా సీజ్‌ చేశారు. దాంతో ఆ కారు అప్పట‍్నుంచి థానే పోలీస్‌ స్టేషన్‌లోనే పడి ఉంది.

ఎండకు ఎండి, వానకు తడిసి, దుమ్ము పట్టేసి ఉన్న కారును ఆటోమొబైల్‌ రంగం నిపుణుడొకరు తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘ కోహ్లి వాడిన ‘ఆడి ఆర్‌8 వీ10 కారు’ పోలీస్‌ గ్రౌండ్‌లోనే ఉంది. ఒకరు వద్ద నుంచి మరొకరి వద్దకు వచ్చి ఇలా పోలీస్‌ స్టేషన్‌లో మగ్గుతుంది. దాదాపు ఏడాది కాలంగా కారు ఇక్కడే చూస్తున్నా. ఇప్పుడు ఆ కారు ఖరీదు ఎంత ఉంటుందో కూడా తెలీదు’ అని పేర్కొన్నారు. ఇలా కోహ్లి వాడిన తొలి ఆడి కారు పోలీస్‌ స్టేషన్‌లో ఉండటం ఫ్యాన్స్‌కు కాస్త బాధ కల్గించే అంశమే. ఒకవేళ ఈ విషయం కోహ్లి వరకూ చేరితే దాని కోసం ఏమైనా చేస్తాడేమో చూడాలి.

- Advertisement -