రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర అధికారుల బృందం శుక్రవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి, ఆరుట్ల, ఇబ్రహీంపట్నం, పోల్కంపల్లి, రాయపోల్ తదితర గ్రామాలలో ఉపాధి హమీ పనులు జరుగుతున్న తీరు తెన్నులను కేంద్ర బృందం పరిశీలించింది.
ఉపాధి హామీ పనుల మస్టర్ రోల్, కూలీల పనుల నిర్వహణ, పనుల నాణ్యత వంటి అంశాలను పరిశీలించారు కేంద్ర బృందం. అలాగే పల్లె ప్రగతి కింద ఉపాధి హామితో అనుసంధానించి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, రోడ్లకిరువైపుల మొక్కలు, సీసీ రోడ్లను పరిశీలించిన బృందం అభినందించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా, తెలంగాణలో అద్భుతంగా ఉపాధి హమీ, అనుబంధ పనులు జరుగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లికి చెప్పి, బృందం అభినందించారు.
రూ.780 కోట్ల ఉపాధి హామీ నిధుల్లో, రూ.199 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో రూ. 143 కోట్లు విడుదల చేయనున్నట్లు కేంద్ర బృందం వెల్లడించింది. రాష్ట్రంలో 18 కోట్ల పని దినాల వరకు ఉపాధి హమీ పనులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఉపాధి హామీ పనులు ఎంత చేయగలిగితే, అంత వరకు అవకాశం కల్పిస్తామని హామీ బృందం హామీ ఇచ్చింది. ఉపాధి హామీతో, వ్యవసాయ అనుబంధానికి మరికొంత సమయం పడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి కేంద్ర బృందం వివరించింది.
అలాగే మిషన్ భగీరథ పనులను పరిశీలించి కేంద్ర బృందం మంత్రిని అభినందించింది. కేంద్ర బృందంలో, ఉపాధి హామీ పథకం జాయింట్ సెక్రటరీ రోహిత్ కుమార్, జాయింట్ డైరెక్టర్ అమరేందర్ ప్రతాప్ సింగ్, కన్సల్టెంట్ కిరణ్ కుమార్ పాండే తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర బృందాన్ని అభినందించి, సత్కరించారు.