పీహెచ్ఎల్‌‌లో తెలంగాణ టైగ‌ర్స్‌..

248
Premier Handball League
- Advertisement -

కొవిడ్‌తో కొంచెం ఆల‌స్య‌మైనా క్రీడాభిమానుల‌ను అల‌రించేందుకు ప్రీమియ‌ర్‌ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్ఎల్‌) ఫుల్ జోష్‌తో వ‌చ్చేసింది. పింక్ సిటీ జైపూర్ వేదిక‌గా ఈనెల 24 నుంచి పీహెచ్ఎల్‌ జ‌ర‌గ‌నుంది. శ‌నివారం జైపూర్‌లో లీగ్ షెడ్యూల్‌, జ‌ట్ల ప‌రిచ‌య కార్య‌క్ర‌మం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. హ్యాండ్‌బాల్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా అధ్య‌క్షుడు అరిశెన‌ప‌ల్లి జ‌గ‌న్మోహ‌న్ రావు, ఉపాధ్య‌క్షుడు ఆనందీశ్వ‌ర్ పాండే ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిలుగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్మోహ‌న్‌రావు మాట్లాడుతూ.. భార‌త హ్యాండ్‌బాల్ చరిత్ర‌లో పీహెచ్ఎల్ తో ఒక‌ న‌వ‌‌శ‌కం ఆరంభమైంద‌ని అన్నారు. “పీహెచ్ఎల్ తో దేశంలో హ్యాండ్‌బాల్‌కు కార్పొరేట్ గ్లామ‌ర్ వ‌స్తుంది. వ‌ర్థ‌మాన క్రీడాకారులంద‌రికీ త‌మ ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌డానికి పీహెచ్ఎల్ ఒక మంచి వేదిక‌. ఈ లీగ్‌తో భార‌త్‌లో హ్యాండ్‌బాల్ ముఖ‌చిత్రం మారిపోనుంది. ఒలింపిక్స్‌లో భార‌త్‌ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసేందుకు కూడా ఈ లీగ్ తోడ్ప‌డుతుంది. విదేశీ ఆట‌గాళ్ల‌తో క‌లిసి ఆడ‌నుండ‌డంతో భార‌త యువ‌‌ ఆట‌గాళ్ల‌కు వాళ్ల నుంచి మెళ‌కువ‌లు నేర్చుకొనే అవ‌కాశ‌ముంటుంది” అని జ‌గ‌న్మోహ‌న్‌రావు చెప్పారు.

లీగ్ విష‌యానికి వ‌స్తే తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ టైగ‌ర్స్‌‌తో స‌హా మొత్తం ఆరు జ‌ట్లు ఆరంభం సీజ‌న్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. 30 లీగ్, 3 నాకౌట్‌తో క‌లిపి మొత్తం 33 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. కొవిడ్ కార‌ణంగా తొలి సీజ‌న్ మ్యాచ్‌ల‌న్నీ జైపూర్‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. 18 రోజులు పాటు క్రీడా ప్రేమికుల‌కు మ‌జాను పంచ‌నున్న ఈ లీగ్ వ‌చ్చే నెల 10వ తేదీతో ముగుస్తుంది. లీగ్‌లో విదేశీ ఆట‌గాళ్ల‌తో క‌లిపి మొత్తం 80 మంది ఆట‌గాళ్లు పాల్గొంటున్నా‌రు. లీగ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తి జ‌ట్టులో 14 మంది ప్లేయ‌ర్లు ఉండ‌గా అందులో ఇద్ద‌రు ఆసియా, ఒక‌ యూర‌ప్ ఆట‌గాడు క‌ల‌రు. మ్యాచ్‌ల‌న్నీ సోనీ చానెల్‌తో పాటు ఎయిర్‌టెల్‌, జీయో టీవీలో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం కానున్నాయి.

- Advertisement -