తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జె. జయలలిత దేశంలోని కోట్లాదిమంది ప్రజల హృదయాల్లో ఆరాధ్య నాయకిగా నిలిచిపోయారు. ఆ మహానాయకురాలికి అపురూపమైన నివాళి అర్పించేందుకు ఆమె బయోపిక్ ‘తలైవి’ పేరుతో రూపొందుతోంది. ఆమె స్పూర్తిదాయక జీవిత కథను సెల్యూలాయిడ్‌పై మలచడంలో ‘తలైవి’ టీమ్ ఏ విషయంలోనూ రాజీ పడటం లేదు. జయలలిత పాత్రను కంగనా రనౌత్ పోషిస్తున్నారు.
శనివారం (డిసెంబర్ 5) జయలలిత వర్ధంతి. ఈ సందర్భంగా ‘తలైవి’ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు కంగన. “జయ అమ్మ వర్ధంతిని పురస్కరించుకొని, మా ఫిల్మ్ ‘తలైవి – ద రివల్యూషనరీ లీడర్’కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేస్తున్నాను. నా టీమ్‌కు, ప్రత్యేకించి ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయడానికి సూపర్ హ్యూమన్ లాగా పనిచేస్తోన్న మా టీమ్ లీడర్ విజయ్ సార్‌కు థాంక్స్. కేవలం మరో వారం మాత్రమే ఉంది” అని ట్వీట్ చేయడం ద్వారా తలైవికి ఆమె నివాళి అర్పించారు.
పోస్టర్‌లో తెల్లటి చీర ధరించిన కంగన అచ్చుగుద్దినట్లు జె. జయలలిత మాదిరిగానే కనిపిస్తున్నారు.తమిళ, హిందీ, తెలుగు భాషల్లో ఏక కాలంలో విడుదల కానున్న ‘తలైవి’ చిత్రాన్ని విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి హితేష్ ఠక్కర్, తిరుమల్ రెడ్డి సహ నిర్మాతలు. ‘తలైవి’లో అరవింద్ స్వామి, సముద్రకని, నాజర్, పూర్ణ, మధూ, భాగ్యశ్రీ ఇతర ప్రధాన పాత్రధారులు.