సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత తొలగిపోయింది. రజనీకాంత్ పార్టీ పెడతాడా లేదా అనే మీమాంసలో ఉన్న సమయంలో తాను డిసెంబర్ 31న పార్టీ ప్రకటన చేస్తానని, జనవరిలో పార్టీ లాంచింగ్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రజనీకాంత్ నిర్ణయంతో తమిళనాట రాజకీయం మరింత వేడెక్కనుందని తెలుస్తుంది.
ఇటీవలే ఆర్ఎంఎం (రజనీ మక్కల్ మండ్రం) సభ్యులతో సినీనటుడు రజనీకాంత్ సమావేశమై చర్చించిన విషయం విదితమే. చెన్నైలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో కొనసాగిన ఆ సమావేశం ముగిసిన అనంతరం తన నివాసం వద్ద మాట్లాడుతూ రాజకీయ రంగ ప్రవేశంపై వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తానని రజనీ చెప్పారు. చెప్పినట్లే ఆయన ఈ రోజు కీలక ప్రకటన చేశారు. కొత్త సంవత్సరంలో కొత్త పార్టీ పెడతానని స్పష్టం చేశారు.
ఈ నెల 31న పార్టీని ప్రకటించనున్నట్లు ట్వీట్ చేశారు. ఆ రోజునే తాను అన్ని వివరాలను ప్రకటిస్తానని తెలిపారు. ఆయన చేసిన ప్రకటనతో అభిమానులు సంబరాలు ప్రారంభించారు. పలు జిల్లాల్లో మిఠాయిలు పంచుకుంటున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని కొన్ని ఏళ్లుగా జరుగుతోన్న ప్రచారానికి ఒక్క ట్వీట్ తో ఆయన తెరదించారు.