బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓటు అడిగే అర్హత లేదు: ఎమ్మెల్సీ కవిత

185
mlc kavitha
- Advertisement -

హైదరాబాద్ ప్రజల నోటికాడ ముద్దను లాక్కున బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మ నరేష్ నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గత ఆరేండ్లగా హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తామని.. టిఆర్ఎస్ జైత్రయాత్ర గాంధీ నగర్ డివిజన్ నుంచే ప్రారంభమవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు.

ఉదయం గాంధీ నగర్ లో గల లక్ష్మీ గణపతి ఆలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు‌. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీ నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా పద్మనరేష్, టీఆర్ఎస్ నేతలు ముఠా జైసింహ, ఎమ్మెల్సీ కవితతో పాటు ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అబిడ్స్ సర్కిల్ ఆఫీస్ కార్యాలయంలో జరిగిన, టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మనరేష్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

గత ఆరేండ్లలో హైదరాబాద్ లో 67 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు ఎమ్మెల్సీ కవిత. కరోనా వచ్చినా, వరదలు వచ్చినా ప్రజలకు సేవ చేసిన పార్టీ కేవలం టీఆర్ఎస్ మాత్రమే అని కవిత గుర్తుచేశారు. ఆరు నెలల పాటు కరోనా కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటే, నెలకు రూ.1500 ఇచ్చి ఆదుకున్నామన్న ఎమ్మెల్సీ కవిత, హైదరాబాద్ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ఒక్క పైసా సాయం కూడా చేయలేదన్నారు. అంతేకాదు వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ ప్రజలు తీవ్రంగా నష్టపోతే, బీజేపీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

వరదల వల్ల నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ అందిస్తున్న రూ. పదివేల సహాయాన్ని, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి అడ్డుకున్నారని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనంలో గత ఆరేండ్లలో గాంధీ నగర్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్న ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా నరేష్ ను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

- Advertisement -