ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ‘దేశ్ బచావో’ పేరుతో యూట్యూబ్‌లో మ్యూజిక్ ఆల్బమ్‌ను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. తమ్ముడు’ చిత్రంలోని ‘ట్రావెలింగ్ సోల్జర్’ పాటకు రీమిక్స్‌గా ఈ పాటను కంపోజ్ చేశారు. గతంలో ప్రత్యేక హోదా కోసం పవన్ చేసిన స్పీచ్‌లోని కొన్ని వ్యాఖ్యలను ఇందులో జోడించారు. జనసేన యూట్యూబ్ చానల్‌లో కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన పవన్.. ప్రతి 45 నిమిషాలకు ఒక్కో పాట చొప్పున.. ఇవాళ మొత్తం నాలుగు పాటలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆల్బమ్ ద్వారా జనసేన వేర్పాటు వాద రాజకీయాలకు, నేర రాజకీయాలకు వ్యతిరేకంగా తమ వాయిస్ వినిపిస్తున్నట్లు పవన్ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో ఉంది.
— Pawan Kalyan (@PawanKalyan) January 24, 2017
ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖ ఆర్కే బీచ్‌లో యువత తలపెట్టిన ఆందోళనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయంపై పలు ట్వీట్ల ద్వారా స్పందించారు. ప్రత్యేక హోదాకు మద్ధతుగా ‘‘మేము పూల గుత్తులు వ్రేలడే వసంత రుతువులం కాదు వట్టి మనుష్యులం! దేశం మాకు గాయలిచ్చినా నీకు మేము పువ్వులిస్తున్నాం.. ఓ ఆశచంద్రికల కుంభవృష్టి కురిశే మిత్రమా… యోచించి ఏమి తెస్తావో.. మా అందరి కోసం ఓటు అనే బోటు మీద ఒక సముద్రం దాటావు’’ అనే శేషేంద్ర పలుకులను పవన్ గుర్తు చేశారు. ‘‘ నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో.. అది నీ శరీర క్షేత్రంలో, చల్లలేకపోతే అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే నీవు బానిసగానే ఉండిపోవడానికే నిర్ణయించుకుంటే ఎంత ద్రోహివిగా మారావు ఆ పవిత్ర రక్తానికి అంటూ శేషేంద్ర శర్మ రాతలను పవన్ కల్యాణ్ సందర్భానుసారంగా ప్రస్తావించారు. అకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా జనసేన గొంతు కలుపుతూ మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.