హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దాలనేది అందరి లక్ష్యమని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి. గచ్చిబౌలిలో కమాండ్ కంట్రోల్ డేటా సెంటర్‌ని మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మహేందర్ రెడ్డి..సీఎం కేసీఆర్ దూరదృష్టితో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రూపకల్పన చేశారని చెప్పారు.
హైదరాబాద్‌కు అంతర్జాతీయ పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపిన డీజీపీ….నగరంలో మహిళల భద్రతకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసు శాఖ ఏర్పాటు చేసుకుంటోందని…. టెక్నాలజీ సామాన్యుడికి చేరువ కావాలన్నారు. ఏదైనా ఘటన జరిగితే 5 నిమిషాల్లోపే ఘటనాస్థలికి పోలీసులు చేరుకుంటున్నారని… ప్రజా భద్రతకు తెలంగాణ పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు. ఈ డేటా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.