ఎస్సీ,ఎస్టీల హక్కుల పరిరక్షణకు,ఆత్మ గౌరవాన్ని మరింత పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు,అత్యాచారాలను అరికట్టేందుకు తీసుకువచ్చిన పిసిఆర్,పిఓఎ చట్టాలను మరింత పకడ్బంధీగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు.షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం మాసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ లో పిసిఆర్,పిఓఎ చట్టాల అమలునకు సంబంధించిన స్టేట్ లెవల్ హైపర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీలలో మరింత ధైర్యమిచ్చే విధంగా ఈ చట్టాల అమలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.ఛార్జీషీట్ వేసేందుకు కొంత ఆలస్యం జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ విషయంలో వేగాన్ని పెంచాలని మంత్రి అధికారులను కోరారు. హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న చర్యల గురించి చక్కని సందేమిచ్చేందుకు గాను హైదరాబాద్లో “సివిల్ రైట్స్ డే”ను విస్త్రత స్థాయిలో నిర్వహించే ఆలోచన ఉందని కొప్పుల చెప్పారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మరింత చురుగ్గా, బాధ్యతాయుతంగా పనిచేసేలా పర్యవేక్షించాల్సిందిగా కోరుతూ కలెక్టర్లకు లేఖలు రాయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలలో ఈ చట్టాల అమలు తీరుపై ప్రతి నెల సమీక్షా సమావేశాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్,కమిషనర్ యోగితారాణా, పోలీసు అడిషనల్ డిజి గోవింద్ సింగ్,డిఐజి శ్రీనివాసరావు,ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శి పాండా, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ వైజయంతి తదితరులు పాల్గొన్నారు.