తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్దికి, రైతుల సంక్షేమానికి పాటుపడుతోంది. ఈ క్రమంలో రైతు వేదికలకు శ్రీకారం చుట్టింది.. శనివారం జనగామ జిల్లా కొడకండ్లలో సీఎం కేసీఆర్ రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై ధ్వజమెత్తారు. కిరికిరిగాళ్లు ఉంటారని, రెండు ముచ్చట్లు చెబితే అలాంటివాళ్ల గురించి అర్థమవుతుందని అన్నారు.
“షబ్బీర్ అలీ అని ఒక మాజీ మంత్రి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన దేశనాయకుడో, రాష్ట్ర నాయకుడో తెలియదు కానీ సొంత వ్యవసాయ క్షేత్రంలో వరి పండించాడు. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిసిగునూరు గ్రామంలోని సర్వే నంబర్ 408 నుంచి 413 వరకు ఆయనకు భూములు ఉన్నాయి. ఈ భూముల్లో వరి వేసుకుని పంట కోసిండు. వట్టి వరి గడ్డిని తానే కాల్పించి దొంగనాటకం ఆడాడు. గణేశ్ అనే ఎలక్ట్రీషియన్ ఆ వరి గడ్డిని తగులబెట్టాడు. సీఎం సన్న రకం పెట్టమంటే పెట్టిన.. నష్టపోయాను అని ఆయన ఫాంహౌజ్‌లో పని చేసే గణేశ్ అనే ఎలక్ర్టిషీయన్‌తో చెప్పించిండు. డ్రామాలు చేసిండు. ఇది షబ్బీర్ అలీ కథ.
ఇంత దొంగ ముచ్చట్లా? సొంతపొలంలోనే గడ్డి తగలబెట్టించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. తెలియని వాళ్లు నిజమే అని నమ్మరా? ఇదేనా వీళ్లా రైతులకు మార్గదర్శనం చేసేది. కేసీఆర్‌ను బద్నాం చేయడమే వారు పనిగా పెట్టుకున్నారు. భయంకరమైన మోసాలు చేస్తున్నారు. గుండెల నిండా నిజాయితీ ఉన్న సీఎంను ఎవరూ ఏం చేయలేరు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్,బీజేపీలు అంతా ఓట్ల కోసమే. ఏంచేసైనా ఓట్లు సంపాదించాలనుకుంటున్నారు. మరో నాలుగు రోజుల్లో దుబ్బాకలో ఎన్నికలు జరగబోతున్నాయి. వీళ్లక్కడ గెలిచేది లేది పీకేది లేదు. అక్కడ టీఆర్‌ఎస్ గెలుపు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.