రాష్ట్ర బీజేపీ నేతలు తమ వైఖరితో బీజేపీని భారతీయ జూటా పార్టీగా మార్చారన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే క్రాంతికిరన్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో ఒక్క నాయకుడు కూడా నిజం మాట్లాడటం లేదు. అబద్ధాలే పునాదిగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు. పూటకో పుకారు.. గంటకో అబద్ధం. అసత్యమే వారి ఆయుధం.. అబద్ధాల పునదిపై వారి ప్రచారం సాగుతోంది. శ్రీకృష్ణుడు శిశుపాలుడి తప్పులు లెక్కబెట్టినట్లు బీజేపీ అబద్దలను లెక్కపెడుతున్నామని మంత్రి విమర్శించారు.
బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 2016లో 1600 మోడీ ఇస్తున్నట్లు బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు.కేసీఆర్ కిట్ 13 వేళలో 6 వేలు కేంద్రం ఇస్తున్నదని ఒకరు, 8 వేలు అని ఇంకొక్కరు అంటున్నారు.. ఇవి నూటికి నూరు శాతం రాష్ట్ర సర్కారువే. గొర్రెల యూనిట్లలో 50 వేలు బీజేపీ, 25 వేలు టిఆర్ఎస్ అంటున్నారు.. ఒక్క పైసా కూడా వారిది లేదు.. యూనిట్ కాస్ట్ కూడా వారికి తెలియదు.. పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. చేగుంటలో 25 కోట్లతో మంజూరైన ఇఎస్‌ఐ హాస్పిటల్ గజ్వెల్‌కు తరలించారని ప్రచారం.. గజ్వెల్‌లో హాస్పిటల్ చూపుతారా ? కనీసం సాంక్షన్ లెటర్ అయినా చూపుతారా ? అని మంత్రి హరీష్ ప్రశ్నించారు.
రేషన్ బియ్యంలో 29 రూపాయలు తామే భరిస్తున్నమన్నది అబద్ధం.. కేంద్రం ఇచ్చేది సగం కార్డులకే.. మిగతా సగం కార్డుల సబ్సిడీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. దుబ్బాకకు పాలిటెక్నిక్ సాంక్షన్ అబద్ధం. కేసీఆరే మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నట్లు బీజేపీ ప్రచారం చేస్తున్నారు. ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే అన్నట్లుగా ఉన్నది వారి తీరు. తెలంగాణలో వరి ధాన్యం కనీస మద్దతు ధరకు కోనేందుకు 5,500 కోట్లు విడుదల చేశామనడం పచ్చి అబద్ధం.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేశారు. డబ్బులు దొరికితే ఇల్లు మాది కాదన్న రఘునందన్ రావు ప్రచారం మానేసి ఆఘమేఘాల మీద అక్కడికి ఎందుకొచ్చారు.. ఎందుకు ధర్నాలు, ఆందోళనలు చేశారు.
పోలీసులే తెచ్చి పెట్టారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. వల్ల అత్తమామలు అసలు విషయం చెప్పారు.. వాస్తవాలు వీడియోలతో సహా ఋజువయ్యాయి. పోలీసులపై దాడి చేసి.. డబ్బులు ఎత్తుకుపోయి నానా హంగామా చేశారు. ఇలాంటి మోసపూరిత మాటలు వింటే మోసపోతాం.. గోస పడతామని దుబ్బాక ప్రజలు ఆలోచించాలని మంత్రి సూచించారు. మేం గెలిస్తే పసుపు బోర్డు తెస్తామని బాండ్ పేపర్‌పై రాసిచ్చారు.. పసుపు బోర్డు తెచ్చారా ? టిఆర్ఎస్ ఇచ్చిన మాట మేరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. చేయగలిగేదే చెబుతున్నాం.. చెప్పింది చేస్తున్నాం. బీజేపీ పైసలను, సీసాలను నమ్ముకున్నది.. మేం అభివృద్ధిని నమ్ముకున్నాం అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.