త్వరలోనే పూర్తిగా కోలుకుంటాను- కపిల్‌ దేవ్‌

213
Kapil Dev
- Advertisement -

భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌కు శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఆయనను ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కపిల్‌ తన కూతురు ఆమ్యాతో కలిసి దిగిన ఫొటోను ఆయన పోస్టు చేశారు. కపిల్ దేవ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సంతోషంగా ఫొటోకి పోజు ఇచ్చారు. కపిల్‌ కూడా తన ఆరోగ్యం గురించి స్పందిస్తూ కొన్ని గంటల క్రితం ట్వీట్ చేశారు. తన ఆరోగ్యం గురించి తెలుసుకుని, స్పందిస్తూ తనపై ప్రేమ చూపించిన అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు. తాను త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని చెప్పారు.

అనారోగ్యంతో ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరిన కపిల్ దేవ్‌కు యాంజియోప్లాస్టీ చికిత్స చేశామని, అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ”ఛాతినొప్పితో కపిల్‌దేవ్‌ గురువారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు యాంజీయోప్లాస్టీ చికిత్స అందించాం. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో డిశ్ఛార్జ్‌ చేస్తాం” అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇక దేశానికి ప్రపంచకప్‌ అందించిన తొలి కెప్టెన్‌గా కపిల్‌దేవ్‌ చరిత్ర సృష్టించారు.

- Advertisement -