కరోనా వైరస్ వ్యాప్తితో ఏర్పడిన సంక్షోభం వల్ల బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి ఊరట కలిగిస్తూ కేంద్రం మారటోరియం విధించిన విషయం తెలిసిందే. అయితే మారటోరియం పొడగింపుపై కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు మారటోరియం పొడగించడం కుదరదంటూ సుప్రీం కోర్టులో శనివారం సుప్రీం కోర్టులో కేంద్రం, ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేశాయి. కరోనాతో ఆదాయం తగ్గిన వివిధ రంగాల వారికి మారటోరియంతో ఊరట కల్పించామని కేంద్రం పేర్కొంది. ఆర్థిక విధానాలు ప్రభుత్వానికి చెందినవని, కోర్టుల జోక్యం తగదని కేంద్రం అభిప్రాయపడింది.
మారటోరియం వ్యవధి 6 నెలలకు మించితే మొత్తం చెల్లింపుల తీరుపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేశాయి. వడ్డీపై వడ్డీ మాఫీ చేయడమే కాకుండా ఇతర ఊరట కల్పించినా భారత ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని కేంద్ర సర్కారు తెలిపింది. కరోనా వ్యాప్తికి ముందు రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాలు సంక్షోభంలో పడ్డాయని పేర్కొంది. దీంతో ఆయా రంగాల ఇబ్బందులను బ్యాంకింగ్ నిబంధనల ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేసింది.