దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్‌లో ఆర్యవైశ్యులంతా టీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చేందుకు ఓ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులకు కేసీఆర్ చేసిన మేలులు ఎనలేనివన్నారు. 11 మంది ఆర్యవైశ్యులను మున్సిపల్ చైర్మన్లుగా, ఇద్దరిని డిప్యూటీ మేయర్లుగా, ఇద్దరిని కార్పొరేషన్ చైర్మన్లు, ఒకరికి ఎమ్మెల్యేగా అవకాశమిచ్చారని తెలిపారు. ఉప్పల్ భగాయత్ 150కోట్ల విలువైన ఐదెకరాల భూమిని తెలంగాణలో ఉన్న ఆర్యవైశ్యుల కోసం కేటాయించడం జరిగిందన్నారు. గతంలో ముఖ్యమంత్రులంతా ఆర్యవైశ్యులను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప వైశ్యజాత అభ్యున్నతికోసం పనిచేయలేదని తెలిపారు.
కేసీఆర్ గత ఆరేళ్లలో మార్కెట్ యార్డు చైర్మన్లుగా, దేవాలయాల చైర్మన్లుగా, డైరక్టర్లుగా అవకాశమిచ్చారని తెలిపారు. త్వరలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుచేయనున్నారని తెలిపారు. వైశ్య బిడ్డల్ని అమెరికా పంపి ఉన్నత చదవులు చదివించిన ఘనత కేసీఆర్ దేనన్నారు. అలాగే దుబ్బాక ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, కచ్చితంగా లక్ష మెజార్టీ వస్తుందని ఉప్పల శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేసారు. కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పధకాలే పార్టీని గెలిపిస్తాయని, వైశ్యులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని తెలిపారు. జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు దక్కవన్నారు. గతంలో బీజేపీకి 105మందికి డిపాజిట్లు దక్కలేదని ఈ ఎన్నికలోనూ బీజేపీకి అదే పరిస్థితి ఎదురవుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి అసలు అభ్యర్ధే దొరకడం లేదంటూ ఎద్దేవా చేసారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన రామలింగా రెడ్డి తనకు మంచి మిత్రుడని ఆయన చనిపోవడం బాధాకరమన్నారు. అయినా కేసీఆర్ న్యాయకత్వంలో హరీష్ రావు సిద్దిపేట, దుబ్బాకలను రెండు కళ్లుగా చూసుకుంటూ ముందుకెళ్తున్నారని తెలిపారు. దుబ్బాకను అద్భుతమైన నియోజకవర్గంగా తీర్చుదిద్దుతామని వెల్లడించారు. అనంతరం ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులంతా ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తామని వాగ్ధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అటవీశాఖ చైర్మన్ ఒంటేరు ప్రతాప రెడ్డి, ఐవీఎఫ్ జనరల్ సెక్రటరీ పబ్బా చంద్రశేఖర్, దౌల్తాబాద్ సర్పంచ్ ఆది వెంకన్న , దౌల్తాబాద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్, దౌల్తాబాద్ ఐవీఎఫ్ అధ్యక్షుడు పి. అశోక్, జి. శ్రీనివాస్, ఎం. నరేష్, పి. ఆంజనేయ, ఎం నారాయణ, ఎస్. శ్రీనివాస్, ఎస్. శ్రావణ్, జి. సతీష్ కుమార్, వి. సురేష్ మరియు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు.