ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం(74) ఇకలేరు. ఆగస్ట్ 5న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలు గత 50 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మధ్యాహ్నం 1.04ని.లకు బాలు తిరిగి రాని లోకాలకు వెళ్ళారు. బాలు ఇకలేరన్న వార్త సంగీత ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన గొంతులో భక్తి తొణికిసలాడుతుంది. విరహం, విషాదం,ప్రేమ గీతాలైనా, మాస్ బీట్స్,సందేశాత్మకాలైనా నోట అలవోకగా జాలువారుతాయి. ఆయన పాట పంచామృతం,గానం స్వరరాగ నాదామృతం. విలక్షణ గాయకుడిగా తనకంటూ భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనే బాలసుబ్రమణ్యం. తెలుగు సినిమా పాటకు ఘంటసాల తరువాత లభించిన సిసలైన వారసుడు బాలసుబ్రహ్మణ్యం.
1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. బాలు అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్న బాలుకి.. తొలిసారిగా 1966లో విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో పాడే అవకాశం వచ్చింది.
నాలుగు దశాబ్దాల్లో 11 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడిగా, నటుడిగా, టి.వి వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా సంగీత దర్శకుడిగా యాభై చిత్రాల వరకూ మ్యూజిక్ అందించారు.
ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు.తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం బాలుకే చెల్లింది. 1979 లో వచ్చిన శంకరాభరణం చిత్రానికి తొలి జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నారు.
తర్వాత సాగర సంగమం (1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. 2001లో పద్మశ్రీ అవార్డు రాగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్నారు.