రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం మరిన్ని సంస్కరణలు తీసుకురానున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాల పెంపు పై పలు శాఖల అధిపతులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మరింతగా పెంచుతామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకోసం వివిధ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణల పైన మంత్రి కేటీఆర్ వారితో ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ శాఖదిపతులు హాజరైన ఈ సమీక్ష సమావేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాల్సిన సంస్కరణలు, నిర్ణీత గడువులోగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.
రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె స్ కోసం తీసుకోవాల్సిన సంస్కరణలను తెలియజేసిన మంత్రి, ఈ సారి మరిన్ని సంస్కరణలు తీసుకొస్తాం అన్నారు. ఈ సందర్భంగా న్యాయ, టూరిజం, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ,సివిల్ సప్లై, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సిసిఎల్ఎ వంటి పలు శాఖల పైన మంత్రి కేటీఆర్ ఆయా సెక్రటరీలకు వివరాలు అందజేసి, చేపట్టాల్సిన సంస్కరణలపై పలు సలహాలను, సూచనలను చేశారు. కొన్ని సంస్కరణలను ఒక నెలలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా వేగంగా పని చేయాలని మంత్రి కేటీఆర్ శాఖ అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం చేపడుతున్న సంస్కరణలతో ప్రజలకు సైతం అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం చేపడుతున్న సంస్కరణల ద్వారా ఆయా డిపార్ట్మెంట్ యొక్క సేవల్లో గణనీయమైన సానుకూల మార్పులు వస్తాయన్నారు. దీంతోపాటు ప్రజలకు ఏ సేవ అయినా ఒకే చోట అందించే విధంగా సిటిజన్ సర్వీస్ మేనేజ్మెంట్ పోర్టల్ చేయాల్సిన అవసరాన్ని ఈ సమావేశంలో చర్చించారు. తద్వారా ఏ సేవ అయినా నేరుగా ఆన్ లైన్ ద్వారా అందుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఆయా శాఖలు చేపడుతున్న సంస్కరణలు, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక డాష్ బోర్డ్ ఏర్పాటు చేస్తే వాటిని పర్యవేక్షణ చేసేందుకు సౌకర్యంగా ఉంటుందన్నారు.