ఈ రోజు 13.09.2020. ఇది అతి తక్కువ సార్లు వచ్చే ముహూర్తం. 1850వ సంవత్సరం నుంచి ఇప్పటివరకూ ఇలాంటి ముహూర్తం మనం చూడలేదు. మళ్లీ ఈ ముహూర్తం 2250వ సంవత్సరంలోగా వచ్చే ఆనవాళ్లు కనిపించడం లేదు. నవగ్రహాల్లోని ఆరు గ్రహాలు ఉచ్ఛస్థితిలో వాటి స్వక్షేత్రంలోనే ఉండటం ఈ ముహూర్తం ప్రత్యేకత. ఇలాంటి ముహూర్తాన శ్రీరామచంద్రుడు పుట్టాడని పెద్దలు చెప్తారు. తెలుగు జ్యోతిష్యాన్నీ, నవగ్రహ కూటమినీ, వాటి కదలికల్నీ నమ్మే వాళ్లకు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య అద్భుతమైన అమృత ఘడియలుగా పెద్దలు నిర్ణయించారు.
అలాంటి అరుదైన ముహూర్తాన చిన్నికృష్ణ స్టూడియోస్ సమర్పణలో బిల్వా క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా రూపొందే చిత్రాన్ని ప్రారంభించారు. ఆ సినిమాకి ‘వైకుంఠ ఏకాదశి రోజున..’ అనే టైటిల్ ఖరారు చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న చిన్నికృష్ణ ఆఫీసులో ఆయన కుమార్తె ఆకుల ఊర్మిళాదేవి.. జ్యోతి ప్రజ్వలన చేయడం ద్వారా ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు.
ఫస్టాఫ్ గోవాలో, సెకండాఫ్ కాశీలో కథ జరుగుతుందనీ, ఈ కథ ఐదేళ్ల కష్టానికి ఫలితం అనీ చిన్నికృష్ణ తెలిపారు. కథను సమకూర్చడంతో పాటు, స్క్రీన్‌ప్లే, సంభాషణలు కూడా ఆయన రాస్తున్నారు. ఇంతవరకూ తెలుగుతెరపై కనిపించని సన్నివేశాలు, వినిపించని సంభాషణలు ఈ చిత్రంలో చూస్తారని ఆయన చెప్పారు. ఎవరూ ఇలాంటి సబ్జెక్ట్‌ను ఇంతవరకూ స్పృశించలేదని ఆయన తెలిపారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టి, బయట సాధారణ పరిస్థితులు నెలకొన్నాక షూటింగ్ మొదలు పెట్టనున్నారు. గోవాలోని ఒక రిసార్ట్‌లో పెద్ద సెట్ వేసి సాధ్యమైతే డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ చెయ్యనున్నారు. ఆ తర్వాత 60 శాతం షూటింగ్‌ను కాశీలో నిర్వహించనున్నారు.ఈ చిత్రానికి నిర్మాతలుగా చిన్నికృష్ణ, ఆయన కుమారుడు ఆకుల చిరంజీవి వ్యవహరించనున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా వెంకట్ ప్రసాద్ పనిచేస్తున్నారు. ఐదు భాషల్లో ఏక కాలంలో రూపొందనున్న ఈ చిత్రానికి ముగ్గురు దర్శకులు పనిచేయనుండటం విశేషం. తెలుగు-కన్నడ వెర్షన్లకు ఒక దర్శకుడు, తమిళ-మలయాళం వెర్షన్లకు ఒక దర్శకుడు, హిందీ వెర్షన్‌కు ఒక దర్శకుడు పనిచేయనున్నారు.
అందుకు అనుగుణంగానే తెలుగు-కన్నడ వెర్షన్లలో ఒక హీరో హీరోయిన్ల జంట, తమిళ-మలయాళం వెర్షన్లలో ఇంకో హీరో హీరోయిన్ల జంట, హిందీ వెర్షన్లో మరో హీరో హీరోయిన్ల జంట నటించనుండటం విశేషం. అంటే ఒకే కథకు ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు దర్శకులు పనిచేయనున్నారు. వారి పేర్లను త్వరలో వెల్లడించనున్నారు.మొదట దర్శకులను ఫైనలైజ్ చేశాక, ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తామని నిర్మాతలు తెలిపారు. నరసింహా, నరసింహనాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రినాథ్ చిత్రాలతో నన్న ప్రేక్షకులు అమితంగా ఆదరించారు. వాటన్నింటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కష్టంతో తయారుచేసిన కథతో రూపొందనున్న ‘వైకుంఠ ఏకాదశి రోజున..’ చిత్రాన్ని కూడా కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను.” అని చిన్నికృష్ణ చెప్పారు.
కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: చిన్నికృష్ణ
సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్
నిర్మాతలు: చిన్నికృష్ణ, ఆకుల చిరంజీవి
సమర్పణ: చిన్నికృష్ణ స్టూడియోస్
బ్యానర్: బిల్వా క్రియేషన్స్.