జల్లికట్టు నిషేదంపై తమిళ్ హీరోలు కమల్ హాసన్, రజినీకాంత్ స్పందించారు. తమిళ సంస్కృతి సంప్రదాయాల్లో జల్లికట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉందని.. జల్లికట్టుపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేయాలని తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. జల్లికట్టును నిర్వహించేలా అనుమతి ఇవ్వాలని కోరారు .కమల్ హాసన్ మాత్రం ఈ విషయంపై ఇంకాస్త ఘాటుగా స్పందించారు. జట్టికట్టు నిషేధించాలంటే.. బిర్యానీ కూడా నిషేధించాల్సిందేనన్నారు. తమిళ సంస్కృతి సంప్రదాయాల్లో జల్లికట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు.
జల్లికట్టు అంటే అదేదో ఎద్దుకి, మనుషులకి మధ్య జరిగే క్రూరమైన ఆట కాదు. తమిళంలో జల్లికట్టుని ఎరు తళువుడల్ అంటారు. అంటే ఎద్దుని ప్రేమగా హత్తుకోవడమని అర్థం. ఎద్దు పట్ల ఆయుధాలు ఉపయోగిస్తే అది మహాపాపం అవుతుంది. జల్టికట్టు ఆటలో ఎద్దును అదుపుచేసే ఆటగాళ్లు కూడా జంతుప్రేమికులే అన్నారు. నా దగ్గర మూడు ఎద్దులు ఉండేవి. నేను విరుమండి సినిమాలో నటిస్తున్నప్పుడు జల్లికట్టు సన్నివేశం కోసం నా ఎద్దులనే పెట్టి చిత్రీకరణ చేశాం. నాలాగే అవీ సినిమాల్లో నటించాయి. జంతువులు ఇలాంటి ఆటలు ఆడటం ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు కానీ దాని అర్థం జంతువులను టార్చర్ చేస్తున్నాం అని కాదు.‘‘జల్లికట్టు ఏసుప్రభు, బుద్ధుడి కాలం నాటికంటే పాతది అని పేర్కోన్నారు.
రాజస్థాన్‌లో ఒంటెలను టన్నుల కొద్ది బరువులు మోయడానికి వాడుకుంటారు. అంతేకాదు భారతదేశంలోని కొన్ని ప్రదేశాల్లో మాంసం కోసం ఒంటెలను చంపేస్తుంటారు. శాఖాకాహారిగా ఉండటం అంటే అహింసకు దూరంగా ఉండటమని కాదు. వాళ్లు కూరగాయలు, ఆకుకూరలు తింటారు. ఆకుకూరలకు కూడా ప్రాణం ఉంటుందని, అవీ మనలాగే రాత్రిళ్లు పడుకుని ఉదయం మెలుకువగా ఉంటాయని ప్రముఖ శాస్త్రవేత్త జగదీశ్చంద్ర బోస్ నిరూపించారు. వాటికీ మనలాగే నొప్పి, భయం ఉంటాయి. వాటిని కోస్తున్నప్పుడు అవి మనలాగే అరవకపోవచ్చు. కానీ దాని అర్థం వాటికి ఎలాంటి బాధ ఉండదని కాదు. పాల ఉత్పత్తుల వాడకం కూడా జంతువులను హింస పెట్టడమే అవుతుంది. పాలు దూడలకు అవసరం. వాటి కోటాను లాగేసుకుని మనం పాలు పితుక్కుని తాగడం క్రూరమైనదే. నేను అసలు పాలే తాగను.’’ అని ఎద్దుల పట్ల తనకున్న ప్రేమను వివరించారు కమల్.
జల్లికట్టు విషయంలోనే కాదు.. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పలు అంశాలపై విధించిన నిషేధాన్ని కమల్ వ్యతిరేకిస్తున్నారు. అశ్లీల సైట్లను ప్రభుత్వం నిషేధించాలని నిర్ణయించినప్పుడు కమల్ ఈ విషయమై స్పందిస్తూ..‘అలాంటప్పుడు కజురహో, బుంది పెయింటింగ్‌లను కామసూత్ర శిల్పాలను కూడా ధ్వంసం చేయాలి. అప్పుడు ఎవర్ని పూజించాలో ఎలా పూజించాలో తీరిగ్గా కూర్చుని ఆలోచించవచ్చు’’ అనితనదైన శైలిలో సమాధానమిచ్చారు.
జల్లికట్టు ఉండాల్సిందే: రజనీకాంత్
జల్లికట్టు ఉత్సవాల విషయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా కమల్‌కు మద్దతు పలికారు. ప్రతి పొంగల్ పండుగ సమయంలో నిర్వహించే జల్లికట్టు తమిళ సంస్క్రతి సంప్రదాయాలకు నిర్వచనమని, అందుకోసమైనా ఈ ఆటను నిర్వహించి తీరాల్సిందేనని తలైవా అన్నారు. వికటన్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైన రజనీ.. జల్లికట్టు విషయమై మీడియాతో మాట్లాడారు. ‘‘ఎలాంటి నిబంధనలైనా పెట్టండి కానీ జల్లికట్టును మాత్రం నిర్వహించి తీరాల్సిందే.’’ అన్నారు. సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో కోడెలతో నిర్వహించే జల్లికట్టు క్రీడను సుప్రీంకోర్టు 2014లో నిషేధించిన విషయం తెలిసిందే.