మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో డైరెక్ట‌ర్ స్వ‌రూప్ మూవీ

158
tollywood
- Advertisement -

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అన‌గానే మ‌న‌కు ‘క్ష‌ణం’, ‘ఘాజీ’, ‘గ‌గ‌నం’ లాంటి అటు ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను, ఇటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌నూ అందుకున్న చ‌క్క‌ని క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు గుర్తుకొస్తాయి. త‌క్కువ కాలంలోనే అభిరుచి క‌లిగిన నిర్మాణ సంస్థ‌గా పేరు తెచ్చుకున్న మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ త‌న ఎనిమిదో చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ఆర్ఎస్‌జె ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించేందుకు స‌న్నాహాలు ప్రారంభించింది. ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస’ ఆత్రేయ లాంటి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను రూపొందించిన ద‌ర్శ‌కుడిగా తొలి చిత్రంతోనే స్వ‌రూప్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు.

ద‌ర్శ‌కునిగా త‌న రెండో చిత్రం కోసం ఒక యూనిక్ స‌బ్జెక్ట్‌ను స్వ‌రూప్ ఎంచుకున్నారు. ఇంకా టైటిల్ ఖ‌రారు కాని ఈ సినిమా క‌థ తిరుప‌తి స‌మీపంలోని ఓ గ్రామంలో ఒక నిధి అన్వేష‌ణ నేప‌థ్యంలో జ‌రుగుతుంది. తొలి చిత్రం త‌ర్వాత స్వ‌రూప్ తన రెండో చిత్రాన్ని ఎలా తీయ‌నున్నార‌నే అమితాస‌క్తి ప్రేక్ష‌కుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టంతో పాటు ఆయ‌నే ర‌చ‌న కూడా చేస్తున్నారు.

ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ సంద‌ర్భంగా చిత్ర బృందం విడుద‌ల చేసిన పోస్ట‌ర్ సినిమాపై ఆ ఆస‌క్తిని రెట్టింపు చేసేలా ఉంది. గ్రామీణ నేప‌థ్యం ఉట్టిప‌డుతున్న విధంగా బ్యాగ్రౌండ్ క‌నిపిస్తున్న ఈ పోస్ట‌ర్‌లో శిథిలావ‌స్థ‌లో ఉన్న ఓ గోడ‌పై ఒక కోడి నిల్చొని ఉంటే, ఆ గోడ మీద “వాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్” అనే హెడ్డింగ్‌తో ఓ పోస్ట‌ర్‌ను అంటించారు. ముఖం స‌రిగా క‌నిపించిన ఓ వ్య‌క్తి ఫొటో కింద రూ. 50 ల‌క్ష‌ల బ‌హుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న క‌నిపిస్తోంది.

అంటే ఆ పోస్ట‌ర్‌లోని వ్య‌క్తిని చంపినా, స‌జీవంగా ప‌ట్టిచ్చినా వారికి రూ. 50 ల‌క్ష‌ల బ‌హుమ‌తిని ఇస్తామ‌నే ఆ ప్ర‌క‌ట‌న బ‌ట్టి, ఆ ఫొటోలోని వ్య‌క్తి ఈ సినిమాకి కీల‌క పాత్ర‌ధారి అని అర్థ‌మ‌వుతోంది. ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నేది ఆస‌క్తిక‌రం.ఇప్ప‌టికే రెండు భారీ చిత్రాలు – మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య‌’, అక్కినేని నాగార్జున‌తో ‘వైల్డ్ డాగ్’ – నిర్మిస్తోన్న మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఇప్పుడు ఆస‌క్తిక‌ర కథాంశంతో వ‌రుస‌గా మూడో చిత్రాన్ని ప్ర‌క‌టించడం గ‌మ‌నార్హం.నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్న‌ ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే డిసెంబ‌ర్ నెల‌లో ప్రారంభం కానున్న‌ది. ఈ చిత్రానికి ప‌నిచేసే తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

- Advertisement -