రాష్ట్రంలో పరిశ్రమలశాఖ, పోలీసుశాఖల పనితీరు మెరుగ్గా ఉందిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రగతిభవన్‌లో సీఎం నేడు హోంశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. ఈ భేటీకి హోంశాఖ కార్యదర్శి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమలు, శాంతిభద్రతలపై సీఎం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ..
రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయన్నారు. పోలీసుల పనితీరు వల్ల క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. పోలీసు, పరిశ్రమలశాఖలు సమర్థంగా పనిచేస్తున్నాయని తెలిపారు. పోలీసులు మానవతా కోణంలో నేరస్థులను బాగు చేస్తున్నారని చెప్పారు. శాంతి భద్రతలు బాగున్నందునే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబుడులు పెడుతున్నారన్నారు. టీఎస్‌ఐపాస్ ప్రకటించిన తర్వాత 2,500 పైగా పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటు అయ్యాయని సీఎం వెల్లడించారు. కాగా ఈ సమీక్ష సందర్భంగా కానిస్టేబుళ్ల నియామకాల అంశాన్ని డీజీపీ అనురాగ్‌శర్మ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.